Dark Circles Causes and Treatment:మానవ శరీరంలో కళ్లు ఎంతో కీలకమైనవి. ఇవి మన అందాన్ని ఎంతగానో పెంచుతాయి. అయితే, అలాంటి ముఖ్యమైన కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు మాత్రం మన అందాన్ని తగ్గిస్తాయి. చాలా మంది చాలినంత నిద్ర లేనప్పుడు, తరచూ తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌తో సమతమతమవుతున్నప్పుడు కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయని అనుకుంటారు. అయితే, వీటిలో కొంతమేర నిజం ఉన్నా.. కేవలం ఇవి మాత్రమే కాకుండా కంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు.. చర్మవ్యాధులు, రక్తహీనత, విటమిన్ల లోపం ఉన్నప్పుడు, ఏదైనా దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నప్పుడు, తరచూ డీహైడ్రెషన్ అవుతున్నప్పుడు, వయసు పైబడినప్పుడు కూడా ఇలాంటి నల్లటి వలయాలు వస్తాయని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ పీఎల్ చంద్రావతి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే డార్క్ సర్కిల్‌కు కారణాలు? తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డార్క్ సర్కిల్స్‌కు కారణాలు
- రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోవడం
- రక్తహీనత సమస్య
- కళ్ల చుట్టూ దురద, అలర్జీలు
- కళ్లు లోతుగా, చర్మం పలచగా ఉండడం
- వంశపారపర్యంగా
- మద్యపానం
- ధూమపానం
- ఎండలో ఎక్కువగా తిరగడం
- గంటల తరబడి చదవడం
- టీవీలు ఎక్కువగా చూడడం
- కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల అధిక వినియోగం
డార్క్ సర్కిల్స్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:కంటి కింద నల్లటి వలయాలను మాయం చేయడానికి మనలో చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే క్రీములు, లోషన్లు పట్టిస్తుంటారు. అయితే, వీటిలో ఫోజిక్ యాసిడ్, అర్బూటిన్ పదార్థాలు ఉన్న క్రీములు కొంత ఫలితానిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇవే కాకుండా కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- కళ్లకు సరైన విశ్రాంతి ఇవ్వాలి.
- మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి.
- కళ్లను ఎక్కువగా నలపకూడదు.
- కళ్లద్దాలు ధరించి బయటకు వెళ్లాలి.
- పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
- గులాబి రేకుల రసాన్ని కళ్లకు పట్టించాలి.
- పుచ్చకాయ, స్టాబెర్రీ గుజ్జును నల్లటి వలయాలపై రాయాలి.
- అనాస రసంలో ముంచిన దూదితో నల్లటి వలయంపై రుద్దాలి.
- బంగాళదుంప, కీర దోసలను సన్నగా తరిగి కళ్లపై ఉంచుకోవాలి.