What Happens When Eat Neem Leaves Daily:"తినగ తినగ వేము తియ్యగానుండు" అన్నాడో కవి. కానీ.. చాలా మంది వేప పుల్లతో పళ్లు తోముకోవడానికే అయిష్టత చూపిస్తారు. అయితే.. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. వేపాకులు మొదలు పువ్వు, గింజలు, బెరడు, కొమ్మలు.. ఇలా వేప చెట్టుకు సంబంధించిన ప్రతీది ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు. డైలీ నాలుగైదు వేపాకులు తింటే శరీరంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పోషకాలు అదరహో:వేపాకుల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి హైపర్ గ్లైసెమిక్, యాంటి అల్సర్, యాంటి మలేరియల్, యాంటి ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మ్యుటాజెనిక్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి. వేపలో విటమిన్ A, C, కెరొటినాయిడ్స్, ఒలియిక్, లినోలియిక్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి.
మలబద్ధకానికి విరుగుడు:నిశ్చల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి పలు కారణాల వల్ల నేటి రోజుల్లో మలబద్ధకంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువవుతోంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారికి.. వేపాకు ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. వేప ఆకుల్లో ఉండే ఫైబర్ పేగుల కదలికలను మెరుగుపరుస్తుందని.. కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం అందిస్తుందని అంటున్నారు.
లివర్ ఆరోగ్యం భేష్: పరగడుపున వేప ఆకులు తింటే.. లివర్‌ను ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వేపాకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి లివర్‌ను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయంటున్నారు. అలాగే వేప ఆకులు రక్తాన్ని శుద్ధిచేసి.. రక్తంలోని మలినాలను తొలగించి లివర్ పనితీరును మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.
అలర్ట్ : పిజ్జా, చిప్స్ తింటే చిన్నవయసులోనే "పెద్ద మనిషి" అయిపోతారు! - షాకింగ్ రీసెర్చ్!
షుగర్ కంట్రోల్: బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో వేపాకులు దివ్యౌషధంలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పరగడుపున వేపాకులను తిన్నా, వేప ఆకులతో కషాయం తయారుచేసుకొని తాగినా, వేపాకులు పొడిని తీసుకున్న రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయని అంటున్నారు. 2009లో "ఫిటోథెరపీ రీసెర్చ్" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ ఉన్న వ్యక్తులు 12 వారాల పాటు రోజుకు 2 గ్రాముల వేపాకు పొడి తీసుకుంటే.. వారి రక్తంలో చక్కెర స్థాయిలు (FBS), HbA1c స్థాయిలు, ట్రైగ్లిసెరైడ్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో బెంగుళూరులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఫార్మాకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సి.కె. రాజ్ పాల్గొన్నారు.
పేగు ఇన్ఫెక్షన్స్ పరార్: ఖాళీ కడుపుతో వేపాకులు తింటే.. పేగు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని, అలిమెంటరీ కెనాల్‌ను వ్యాధికారకాల నుంచి రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు. మారిన జీవనశైలి, తీసుకునే ఆహారం, మద్యపానం వంటి అలవాట్ల కారణంగా.. చాలామంది పేగు ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారు. వారు వేపాకును ఖాళీ కడుపుతో తింటే.. ఈ సమస్య నుంచి రక్షణ పొందవచ్చంటున్నారు.
చిగుళ్ల సమస్యలకు: చిగుళ్ల వాపు, రక్తస్త్రావం, నోటి దుర్వాసనతో బాధపడేవారు వేపాకులను నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2015లో ప్రచురించిన "జర్నల్ ఆఫ్ క్లినికల్ పీరియాంటాలజీ" అధ్యయనం ప్రకారం, వేపాకులు నమిలిన వారిలో చిగుళ్ల వాపు, రక్తస్రావం గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
రోగనిరోధక శక్తి పెరుగుదల:క్రమం తప్పకుండా వేపాకులు తినడం, వేపాకుల రసం తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గు వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి వీటిలోని పోషకాలు సహాయపడతాయని అంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వేపాకు మంచిదని అతిగా తింటే దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. రోజుకు 5 నుంచి 6 ఆకులకు మించకుండా చూసుకోవాలంటున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఏం చేసినా మైగ్రేన్ తగ్గట్లేదా? - ఇలా చేస్తే నిమిషాల్లో ఏళ్ల నాటి బాధ నుంచి రిలీఫ్!