Improve Brain Power Food :మానవ శరీరంలో మెదడు ఎంత ముఖ్యమైన అవయవమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ పని మెదడు అనుమతితోనే జరుగుతుంది. అందుకే దాని ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందుకే బ్రెయిన్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా చురుగ్గా, పవర్ఫుల్గా పని చేసేందుకు.. చేపలు, ఆకుకూరలు లాంటి పలు రకాల ఆహార పదార్థాలను మీ డైట్లో చేర్చుకోవాలని ప్రముఖ వైద్య అధ్యయన సంస్థ హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ వెల్లడించింది. వీటి వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆ సంస్థ చీఫ్ మెడికల్ ఎడిటర్ డాక్టర్ హౌవార్డ్ ఈ లూవైన్ వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు
బచ్చలికూర, కొల్లార్డ్, బ్రోకలీ వంటి ఆకుకూరలు తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని చెప్పారు. ఇందులోని విటమిన్ కే, లుటిన్, ఫోలే, బీటా కెరోటిన్ వంటి పోషకాలు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని అనేక పరిశోధనల్లో తేలిందని తెలిపారు.
చేపలు
చేపల్లో మెదడు ఆరోగ్యానికి కృషి చేసే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని వైద్యులు తెలిపారు. ఇవి అల్జీమర్స్ ఉన్నవారిలోనూ వ్యాధి తీవ్రం కాకుండా చేస్తాయని వివరించారు. అందుకోసమే వారానికి కనీసం రెండు సార్లు చేపలను తినడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఒకవేళ చేపలు తినకపోతే దానికి బదులుగా ఒమేగా 3 సప్లిమెంట్స్ కోసం వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. అవిసే గింజలు, అవకాడోలు లాంటి ఒమేగా 3 పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.
బెర్రీలు
బెర్రీలు, ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. హార్వర్డ్ బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో ప్రతి వారం రెండు లేదా అంతకంటే ఎక్కువ బెర్రీలను తిన్న మహిళల్లో జ్ఞాపకశక్తి క్షీణత తగ్గిస్తుందని తేలింది.