Benefits of Drinking Warm Salt Water on Empty Stomach : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. డైలీ తగినంత నీరు తాగడం కూడా అంతే ముఖ్యం. నిజానికి వాటర్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ క్రమంలోనే కొందరు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా రోజు ఉదయం ఖాళీ కడుపున గోరువెచ్చని వాటర్ తాగుతూ ఉంటారు. అలాగే.. మరికొందరు తేనె, నిమ్మరసం కలుపుకొని డ్రింక్ చేస్తుంటారు. అలాకాకుండా.. రోజూ ఉదయాన్నే ఖాళీ పొట్టతో గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు(Salt) వేసుకుని తాగినా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణక్రియకు సహాయపడుతుంది :గోరువెచ్చని ఉప్పునీరు జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇది పొట్టలోని పేగులను చురుగ్గా కదిలేలా చేసి జీర్ణక్రియ సాఫీగా సాగడానికి తోడ్పడుతుంది. అంతేకాదు.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తకుండా అడ్డుకుంటుంది.
ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది :ఉప్పులో సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి.. మీరు డైలీ గ్లాసు గోరువెచ్చని ఉప్పునీరు తాగడం వల్ల ఈ ఖనిజాలను తిరిగి పొందడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే జీవక్రియ సవ్యంగా సాగడానికి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు.
2018లో "జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని ఉప్పునీరు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది :గోరువెచ్చని ఉప్పునీరు మంచి నేచురల్ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అంటే.. ఉప్పులో ఉండే మినరల్స్ శరీరంలోని మలినాలను, టాక్సిన్‌లను బయటకు పంపి.. కణాలను శుభ్రపరచడానికి, డిటాక్సిఫై చేయడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇది చర్మంతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందంటున్నారు.
బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది : శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి గోరువెచ్చని ఉప్పునీరు చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు. ముఖ్యంగా నైట్ నిద్రపోయినప్పుడు ఎనిమిది గంటల పాటు నీరు తాగని వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైమ్‌లో మార్నింగ్ ఇలా గోరువెచ్చని ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని చెబుతున్నారు.