Tips to Prevent the Apple Slices from Colour Change:రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదన్నది నిపుణుల మాట. కారణం.. ఇందులోని పోషకాలు అందించే ప్రయోజనాలే. అయితే యాపిల్‌ను కట్ చేసిన కొద్దిసేపటికే రంగు మారుతుంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం ఉండదు. అయితే యాపిల్ ఇలా రంగు మారడానికి కారణం.. దాని గుజ్జులోని పాలీఫినోల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్. ఈ ఎంజైన్ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి గుజ్జును బ్రౌన్ కలర్‌లోకి మారుస్తుంది. ఎంతో ఇష్టంగా తిందామని అనుకుంటే.. రంగు మారిన కారణంగా వాటిని అస్సలు తినాలనిపించదు. అలాంటి సమయంలో ఈ టిప్స్ పాటిస్తే గంటల పాటు రంగు మారకుండా తాజాగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
నిమ్మరసం:యాపిల్ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే నిమ్మరసం బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అంటున్నారు. అందుకోసం.. కట్ చేసిన యాపిల్ ముక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసాన్ని స్పే చేయాలి. నిమ్మరసంలోని సిట్రిక్ ఆమ్లం యాపిల్ ముక్కలను ఎక్కువసేపు తాజాగా ఉంచడమే కాకుండా.. వాటిని రంగు మారనివ్వదని అంటున్నారు.
ఈ పద్ధతి కూడా ట్రై చేయవచ్చు. కప్పు నీటిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో యాపిల్ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు ఉంచినా చక్కటి ఫలితం ఉంటుందని అంటున్నారు. నిమ్మరసం ప్లేస్‌లో పైనాపిల్ జ్యూస్‌ను ఉపయోగించినా అదే ఫలితాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు.
2009లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం యాపిల్ ముక్కలపై నిమ్మరసం చల్లడం వల్ల ముక్కల రంగు మారలేదని.. 4 గంటల వరకు తాజాగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని Zhejiang University లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్ X. Wang పాల్గొన్నారు.