Screen Effects on Eyes in Children : కొంచెం టైమ్ దొరికినా సరే.. చాలా మంది పిల్లలు టీవీ, ఫోన్ చూస్తూ వాటికే అతుక్కుపోతుంటారు. ప్రస్తుతం ఇది ప్రతీ ఇంట్లో సాధారణంగా మారిపోయింది. ఇంకా విద్యార్థులు, ఉద్యోగులైతే తమ అవసరాల కోసం తప్పనిసరిగా ఫోన్, ల్యాప్ ట్యాప్‌ను వినియోగిస్తుంటారు. అయితే.. ఇలా ఫోన్, ల్యాప్ ట్యాప్‌లు ఎక్కువ సేపు చూసే పిల్లలు, విద్యార్థుల్లో కళ్లు దెబ్బతిని అనేక సమస్యలు వస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. కంటి రెటీనా సమస్యలు, రంగు దృష్టి లోపం, సహజమైన రంగులను గుర్తించలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయని "Impact of color vision deficiency on the quality of life in a sample of Indian population" అధ్యయనంలో వెల్లడైంది. (National Library of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరామ్ మాలే పాల్గొన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం కొందరు చిన్నారులు సహజమైన రంగులను గుర్తించలేకపోయారని.. ఆకుపచ్చ మామిడి ఆకులను పసుపు పచ్చ రంగుగా భావించి చెప్పారని శివరామ్ తెలిపారు. ఇదే కాకుండా కొద్దిసేపు కూడా సూర్యుడి కిరణాలను చూడలేక ఇబ్బంది పడ్డారని.. కాసేపు చూడగానే కళ్లను కిందకు దించుకున్నారని వివరించారు. వందలాది మంది చిన్నారులపై కొన్ని నెలలుగా ఈ అధ్యయనం చేసినట్లు చెప్పారు. గత ఆరేళ్లుగా ఈ సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని.. సుమారు 5 రెట్లు అధికం అయ్యాయని తెలిపారు. నగరాల్లో ప్రతీ 5 మందిలో ఇద్దరికి.. గ్రామాల్లో ప్రతీ ఐదుగురిలో ఒకరికి కళ్ల సమస్యలు తలెత్తుతున్నాయని శివరామ్ చెప్పారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే చాలా ఖర్చులతో కూడుకున్న శస్త్రచికిత్సలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అందుకోసమే ఈ సమస్య పరిష్కారానికి అధ్యయనంలో భాగంగా హెచ్‌సీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరామ్ మాలె 'రిషివ కలర్ ఇల్యూషన్' అనే యాప్‌ను సైతం రూపొందించారు. దీనిని ఇటీవలె ఇండియన్ పేటేంట్ ఆఫీస్ జర్నల్‌లోనూ ప్రచురితమైంది. ఈ యాప్ ద్వారా రంగు దృష్టి లోపం ఉన్నవారు త్వరగానే నిర్ధరణ చేసుకోవచ్చని ఆయన వివరించారు. చిన్నారులు, విద్యార్థుల్లో కళ్లద్దాల వాడకాన్ని తగ్గించడమే తన లక్ష్యమని.. అందుకోసమే ఈ ప్రయత్నమని తెలిపారు.