Solution For Stomach Bloating :మనం తీసుకున్న ఆహారం కొన్నిసార్లు వాంతుల రూపంలో వెనక్కి వచ్చేస్తుంటుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలా జరగడం అనేది సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా తిన్న ఆహారం కాస్త పుల్లగా లేదంటే కారంగా బయటకు వస్తుంది. అదే సమయంలో కడుపుబ్బరంగా కూడా అనిపిస్తుంటుంది. దీని వల్ల ఆహారం తినలేకపోవడం జరుగుతుంది. అసలు కడుపుబ్బరం ఎందుకు వస్తుంది? దానికి పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కడుపుబ్బరం ఎందుకు వస్తుందంటే
Why Stomach Bloating Occurs : కడుపుబ్బరం అనేది ఒక రకమైన పోషకాహార సమస్యగా వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మనం తినే ఆహారం ఆహార వాహిక ద్వారా జీర్ణాశయానికి చేరుతుంది. అయితే ఆహారవాహికకు, జీర్ణాశయానికి మధ్యన ఆహారం తిరిగి వెనక్కి రాకుండా ఒక స్ప్రింకర్ ఉంటుంది. కొన్నిసార్లు ఇది సరిగ్గా మూసుకోకపోయినా లేదంటే గట్టిగా లేకపోయినా ఆహారం వెనక్కి వచ్చేస్తుంటుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా.అంజలీదేవి వివరిస్తున్నారు. ఫలితంగా ఆహారం పులుపు లేదా కారంగా మారి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని వివరిస్తున్నారు. దీని వల్ల కడుపుబ్బరంగా అనిపిస్తుందని అంటున్నారు.
కడుపుబ్బరానికి నివారణ ఏంటంటే
కడుపుబ్బరం నుంచి విముక్తి పొందాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా వరకు క్యాల్షియం లోపించడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని గనుక క్యాల్షియం సరైన మోతాదులో శరీరానికి అందేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, వెన్న, ఇతర పాలతో తయారైన ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలని, వీటిని తీసుకోవడం వల్ల కడుపుబ్బరం సమస్యను నివారించవచ్చని అంటున్నారు.