How to Remove Skin Pigmentation in Natural Ways: అందంగా కనిపించాలన్న ఆరాటం ప్రతి అమ్మాయికీ ఉంటుంది. ఈ క్రమంలోనే చర్మంపై ఏ సమస్య వచ్చినా భయపడిపోతుంటారు. వెంటనే నయం చేసుకొని మునుపటి అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే చర్మానికి వచ్చిన సమస్యలు అంత త్వరగా తగ్గిపోవంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మంగు మచ్చలు కూడా అలాంటి కోవకే చెందుతుందంటున్నారు. అయితే ఈ మంగు మచ్చలను తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మంగు మచ్చలు ఎందుకొస్తాయి: చర్మంపై అక్కడక్కడా ఏర్పడే ప్యాచుల్లాంటి మచ్చల్ని హైపర్ పిగ్మెంటేషన్ (మంగు మచ్చలు) అంటారు. చర్మ కణాల్లోని మెలనోసైట్స్ మెలనిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మానికి రంగునిస్తుంది. అయితే ఇది చర్మంపై అక్కడక్కడా మరీ ఎక్కువగా ఉత్పత్తవడం వల్ల ఈ మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు పాటించాల్సిన టిప్స్..
కలబంద:ఇందులో ఉండే అలోయిన్(Aloin) అనే పదార్థం మంగు మచ్చల సమస్యను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రాత్రి పడుకునే సమయంలో మచ్చలు ఉన్న చోట కలబంద గుజ్జు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా సమస్య తగ్గే వరకు రోజూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉందంటున్నారు.
2017లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 8 వారాల పాటు రోజుకు రెండుసార్లు కలబంద గుజ్జును మంగు మచ్చలపై రాసుకున్న వ్యక్తులలో మచ్చల రంగు, పరిమాణం గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని పంజాబ్ మెడికల్ కళాశాలలో చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ జావేద్ అహ్మద్ పాల్గొన్నారు.
మొటిమలు, నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? - ఇలా ఈజీగా పోగొట్టండి!
యాపిల్ సిడార్ వెనిగర్: యాపిల్ సిడార్ వెనిగర్, నీళ్లు.. సమానంగా తీసుకొని.. ఈ మిశ్రమాన్ని దూదితో మచ్చలున్న చోట అద్దాలి. రెండు మూడు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుందని అంటున్నారు
ఉల్లిపాయ:ఎర్ర ఉల్లిపాయ రసం (ఎక్స్‌ట్రాక్ట్)లో మంగు మచ్చల్ని తగ్గించే గుణాలున్నాయని ఓ పరిశోధనలో వెల్లడైందని నిపుణులు అంటున్నారు. కాబట్టి దీన్ని మచ్చలపై అప్లై చేసుకోని.. కొద్దిసేపటి తర్వాత క్లీన్ చేసుకుంటే.. కొన్ని రోజుల్లోనే సమస్య తగ్గుతుందని అంటున్నారు.
పాలు:పాలలో కాటన్ బాల్‌ని ముంచి..మంగు మచ్చలున్న చోట రుద్దుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే త్వరలోనే సమస్య తగ్గుముఖం పడుతుందని.. ఇందులోని లాక్టికామ్లం మచ్చల్ని తగ్గించడంలో సహకరిస్తుందని అంటున్నారు.
కలబంద: మంగు మచ్చలను తొలగించుకునేందుకు ఈ ఫేస్‌ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం.. ముందుగా ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు తీసుకోవాలి. దానికి టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. ఆ తర్వాత రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మూడింటినీ మిక్స్ చేసి ఎక్కడ మచ్చలున్నాయో అక్కడ అప్లై చేసి.. ఒక పది నిమిషాల తర్వాత మసాజ్ చేసుకొని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అయితే ఈ చిట్కా పాటిస్తున్నప్పుడు శరీరానికి ఎండ తగలకుండా చూసుకోవాలని.. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే స్కార్ఫ్ ధరించాలని సూచిస్తున్నారు. అలాగే హెయిర్ డై లాంటివి ఉపయోగించకూడదని.. ఒకవేళ తప్పనిసరిగా వేసుకోవాలనుకున్నప్పుడు మంగు మచ్చలపై ఏదైనా మాయిశ్చరైజర్‌ని అప్లై చేయాలని చెబుతున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.