తెలంగాణ

telangana

ETV Bharat / health

పిల్లలకు తినేటప్పుడు ఫోన్లు ఇస్తున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? - KIDS USING PHONE WHILE EATING

-బరువు పెరగడమే కాకుండా మాటలు కూడా రావట! -తినేటప్పుడు స్కీన్ టైమ్ తగ్గించేందుకు నిపుణుల టిప్స్

kids using phone while eating
kids using phone while eating (Getty Images)

By ETV Bharat Health Team

Published : Dec 28, 2024, 1:12 PM IST

Kids Using Phone While Eating:చిన్నారులకు ఆహారం తినిపించేందుకు తల్లుల ఎంతో కష్టపడుతుంటారు. కాస్తంత తినడానికి కుటుంబ సభ్యులను ఇల్లంతా ఉరుకులు, పరుగులు పెట్టిస్తుంటారు. దీంతో పిల్లల మారం భరించలేక ఫోన్లు, ట్యాబ్‌లు, ఇచ్చి తినిపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచే గ్యాడ్జెట్స్‌కు బానిసలుగా మారుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లు చూడడం వల్ల కంటి రెటీనా సమస్యలు, రంగు దృష్టి లోపం, సహజమైన రంగులను గుర్తించలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ విషయం "Impact of color vision deficiency on the quality of life in a sample of Indian population" అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరామ్ మాలే ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పద్ధతి మారాలని నిపుణులు వివరిస్తున్నారు. (National Library of Medicine రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

  • ఇంకా కొందరు పిల్లలు ఫోన్లను చూస్తూ అవసరానికి మించి ఆహారాన్ని తీసుకుంటారని.. ఫలితంగా చిన్నవయసులోనే ఉబకాయం బారిన పడుతున్నారని వివరిస్తున్నారు. భవిష్యత్తులో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
  • మరి కొందరు ఫోన్ చూస్తూ.. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెనుకాడుతుంటారని చెబుతున్నారు. దీనివల్ల పిల్లల్లో ప్రసంగ, భాషా, సామాజిక భావోద్వేగాల అభివృద్ధిలో సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • అయితే, ఒకేసారి వాళ్ల నుంచి ఫోన్లు లాక్కున్నా, టీవీలు చూడొద్దన్నా తినకుండా గోల చేస్తారని నిపుణులు అంటున్నారు. అందుకోసమే నెమ్మదిగా గ్యాడ్జెట్స్‌ను దూరం చేయాలని సూచిస్తున్నారు.
  • ఇందుకోసం అందరూ ఒకేసారి కూర్చుని తినేలా పిల్లలకు అలవాటు చేయాలని చెబుతున్నారు. ఇలా తింటోన్న సమయంలో పిల్లలకు పెద్దవాళ్లకు చర్చ జరిగేలా ప్రోత్సహించాలని వివరిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా తింటున్న సమయంలో టీవీ, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూడకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
  • అయితే, అసలు స్క్రీన్‌ సమయం లేకుండా ఆహారం తినడం లేదని వాళ్లమీద కోప్పడితే లాభం లేదని నిపుణులు అంటున్నారు. అందుకోసమే తినేటప్పుడు ముందు 5-10 నిమిషాలు ఇచ్చి తరువాత తీసేసుకోవాలని.. ఇలా నెమ్మదిగా దీనిని తగ్గించాలని సూచిస్తున్నారు.
  • ముఖ్యంగా చిన్నారుల ఆకలి అవసరాలను అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. కడుపు నిండినట్లు అనిపిస్తే తినమని బలవంతం చేయద్దని సూచిస్తున్నారు. కొందరు గ్యాడ్జెట్స్‌ చూడొచ్చన్న సాకుతో ఇష్టమున్నా లేకపోయినా, అవసరమున్నా లేకున్నా తింటుంటారని.. అదీ మానుకోవాలని అంటున్నారు.
  • స్క్రీన్​ చూస్తూ తినడం వల్ల పిల్లలు ఆహారాన్ని ఎక్కువ సేపు నమలకుండానే మింగేస్తుంటారు. ఫలితంగా జీర్ణ సమస్యలు తలెత్తడమే కాకుండా ఆహార పదార్థాలలోని పోషకాలు కూడా సక్రమంగా అందవని నిపుణులు అంటున్నారు.
  • పిల్లలకు కథలు చెప్పడం లేదా పుస్తకాలు చదివించడం లాంటివి చేయించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
  • ఏడు సంవత్సరాల లోపు పిల్లలు రోజుకు రెండు గంటల లోపు స్క్రీన్ టైమ్ ఉండాలని చెబుతున్నారు. ఏడేళ్లు దాటిన పిల్లలు 3 గంటల లోపు ఫోన్లు, టీవీలు వాడాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details