తెలంగాణ

telangana

ETV Bharat / health

కూర్చున్న సీట్​లో నుంచి లేవట్లేదా? గుండె, క్యాన్సర్, షుగర్ వ్యాధులు పక్కా వస్తాయట!

-అతిగా కూర్చోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్న వైద్యులు -ప్రతి రోజు సుమారు 7-8వేల అడుగులు వేయాలని సూచన

Side Effects of Over Sitting
Side Effects of Over Sitting (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Side Effects of Over Sitting:అతిగా ఆహారం తీసుకోవడం, అతిగా నిద్రపోవడం.. ఇలా అతి అనేది ఎదైనా ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఎక్కువగా కూర్చోవడం కూడా ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. కానీ కొంత మంది పని ప్రదేశాల్లో కొన్ని గంటల పాటు కూర్చోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు కూర్చునేవారు, డ్రైవింగ్ చేస్తూ జీవించే వారికి ఇవి తప్పదు. అయితే, ఇలాంటి వారిలో గుండె, మెదడు, కాలేయం, కిడ్నీలపైనా ప్రభావం పడి.. పనితీరు మందగిస్తుందని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేశ్ తెలిపారు. ఇలా శారీరక శ్రమ తక్కువగా చేసే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. ఫలితంగా జీవిత కాలం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.

ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం వల్ల కండరాల్లో కదలికలు లేకుండా పోతుందని డాక్టర్ రాజేశ్ చెబుతున్నారు. ఫలితంగా తీసుకున్న ఆహారం కొవ్వుగా మారి.. శరీరంలో అక్కడక్కడ పేరుకుపోయి స్థూలకాయం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాళ్లలో రక్త ప్రసరణ తగ్గిపోతుందని వివరించారు. దీంతో రక్త నాళాల్లో ఒత్తిడి పెరిగి.. ఫలితంగా రక్త నాళాలు వ్యాకోచించి ఉబ్బిపోతాయని అంటున్నారు. దీంతో వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాళ్ల నుంచి మొదలై ఊపిరితిత్తుల వరకు వ్యాపించి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందన్నారు. వెన్ను కండరాలపై ఒత్తిడి తీవ్రంగా పడి.. మెడ, వెన్నుపూస ఒత్తిడికి గురై పాడైపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంకా రాత్రి పూట నిద్రపోకుండా కూర్చునేవారికి నిద్రలేమి సమస్య ఎక్కువై.. ఆ తర్వాత మానసిక ఆందోళనలకు దారి తీస్తుందని చెబుతున్నారు.

పని ప్రదేశంలో, ఇంట్లో ఎక్కువ సేపు కూర్చోని ఉండడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల తక్కువ కేలరీలు కరిగిపోయి.. కొవ్వు పెరిగిపోయి క్రమంగా డయాబెటిస్ బారిన పడతారని వివరించారు. ఇంకా అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వివరించారు. అలాగే వీరిలో కదలికలు లేకపోవడం వల్ల రక్త ప్రసరణ వేగం మందగించి.. క్రమంగా గుండె సమస్యలు కూడా వస్తుంటాయని అంటున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పేగు, ఎండో మెట్రియల్ ఊపిరితిత్తుల క్యాన్సర్, వయసు పైబడిన వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. ఇంకా వీరిలో మతిమరుపు సమస్య కూడా వస్తుందని తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా శారీరీక శ్రమ చేయాలని డాక్టర్ రాజేశ్ చెబుతున్నారు. ప్రతిరోజు సగటను 7-8వేల అడుగులు వేయాలని సూచిస్తున్నారు. పని ప్రదేశంలో ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా ప్రతి గంటకు కనీసం 3 నిమిషాల పాటు అటు ఇటూ నడవాలని అంటున్నారు. నిత్యం నడక, వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు పాటించాలని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చపాతీ vs అన్నం - షుగర్ రోగులు ఏది తింటే బెటర్? కూరల్లో ఇవి ఉంటే బెస్ట్!!

ఈ చిన్న పనిచేస్తే మీ ఆయుష్షు 11 ఏళ్లు పెరుగుతుందట! - పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details