Mouth Breathing Sleep Effects : చాలా మందికి నోరు తెరిచి పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. సాధారణంగా జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుపోవడం వల్ల నోటితో శ్వాస తీసుకోవాల్సి వచ్చినప్పుడు నోరు తెరిచి నిద్రపోతుంటారు. ఇది తప్పని పరిస్థితి. కానీ జలుబు వంటి ఇబ్బందులేం లేకున్నా కూడా చాలా మంది నోరు తెరిచే నిద్రిస్తుంటారు. నిజానికి పక్కన వాళ్లు చెప్పే వరకూ ఈ విషయం వారికి కూడా తెలియదు. తెలిసినా ఏం చేస్తాంలే అని తీసిపారేయకండి. ఎందుకంటే నోరు తెరిచి నిద్రపోవడం చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి నోరు తెరిచి నిద్రపోవడం వల్ల శ్వాసను నోటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. దీన్నే స్టీప్ అప్నియా అని పిలుస్తారు. ఇది అనారోగ్యకరమైన అలవాటుగా వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట శ్వాస సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు.
నోరు తెరిచి నిద్రపోయే వారిలో ఉండే లక్షణాలు
నిజానికి నోరు తెరిచి నిద్రపోవడం అనేది ఈజీగా తీసుకోవాల్సిన విషయం మాత్రం కాదని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఈ అలవాటు ఉన్న వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ అలవాటు కారణంగా మీ ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ఎలా అంటే నోరు తెరిచి నిద్రపోయే వ్యక్తుల నోరు తరచుగా పొడిబారుతుంది. లాలాజలం త్వరగా ఆరిపోవడం వల్ల ఫలకం ఏర్పాటుకు ఆటంకం కలిగి ఇన్ఫెక్షన్లు, క్యావిటీస్ పెరిగి దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఈ అలవాటు ఉన్న వారి నోట్లో బ్యాక్టీరియా పెరిగి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. వీటితో పాటు గురక, పగటిపూట నిద్రపోవడం, గొంతు నొప్పి వంటి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. నోరు తెరిచి పడకుకునే వారిలో నిద్ర నాణ్యత కూడా తక్కువ అవుతుందని నిపుణులు అంటున్నారు.
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నోరు తెరిచి నిద్రపోయే వ్యక్తుల్లో గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువేనట. ముక్కుకు బదులుగా నోటితో శ్వాసను తీకుంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక శ్వాస మరింత కష్టతరంగా మారుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల ధమనుల్లో రక్త ప్రవాహంపై ప్రభావం పడి గుండె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ అలవాటు కారణంగా శరీరంలోని చాలా అవయవాలపై ప్రతికూల ప్రభావాలు పడతాయి.