తెలంగాణ

telangana

అలర్ట్ : మీకు ఈ ఆరోగ్య సమస్యలుంటే - పాలు అస్సలు తాగొద్దు! - Milk Side Effects

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 12:13 PM IST

Milk Side Effects : పాలు.. మంచి సంపూర్ణ పోషకాహారం. అందరూ డైలీ ఒక గ్లాసు పాలు తాగాలని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Side Effects Of Milk
Milk Side Effects (ETV Bharat)

Side Effects Of Milk :పాలు ఆరోగ్యకమైన ఆహార పదార్థం అయినప్పటికీ.. కొందరు వాటికి దూరంగా ఉండటమే మేలు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొంతమందికి పాలు/పాల పదార్థాలు పడవు. అలాగే.. మరికొందరిలో జీర్ణవ్యవస్థ పాలలోని చక్కెరల్ని జీర్ణం చేసుకోలేదు. ముఖ్యంగా.. 'లాక్టోజ్ ఇన్​టాలరెన్స్' సమస్యతో బాధపడేవారు పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు. అలాంటి వారు పాలకు బదులుగా రోజువారీ ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండే ఇతర కూరగాయలు తీసుకోవచ్చని చెబుతున్నారు.

వారు ఎందుకు పాలను తీసుకోవద్దంటే?

లాక్టోజ్ ఇన్​టాలరెన్స్ సమస్య ఉన్నవారిలో.. పాలు, పాల పదార్థాలలో ఉండే లాక్టోజ్​ను విడగొట్టే లాక్టేజ్ ఎంజైమ్ తగిన మొత్తంలో ఉత్పత్తి కాదు. దాంతో అలాంటి వారిలో కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, తేన్పులు, ఎసిడిటీ, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కాబట్టి వారు పాలు, పాల పదార్థాలను తీసుకోకపోవటమే మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా.. మరికొందరికి ఎప్పుడైనా పాలు, పదార్థాలతో అలర్జీ రావొచ్చు. దీంతో చర్మం మీద దద్దుర్లు వస్తుంటాయి. ఇది తాత్కాలికమే. అప్పుడు, పాలు మానేసి కొంతకాలం తర్వాత తిరిగి ఆరంభించొచ్చంటున్నారు. కాకపోతే.. ఎలాంటి పాల పదార్థాలతో అలర్జీ వస్తుందో గమనించి.. వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఆరోగ్యానికి మంచిదని పచ్చిపాలు తాగుతున్నారా ? - మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!

2017లో 'అలిమెంటరీ ఫార్మకాలజీ అండ్ థెరపిటిక్స్' అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలు, పాల పదార్థాలను తీసుకోకపోవడం వల్ల వారి జీర్ణక్రియ మెరుగుపడినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో జర్మనీలోని డ్రెస్డెన్​లోని యూనివర్సిటీ హాస్పిటల్ కార్ల్ గుస్తావ్ కార్లింగ్​కు సీనియర్ రీసెర్చ్ ఫిజీషియన్ డాక్టర్ క్రిస్టినా స్టెఫ్ఫెన్ పాల్గొన్నారు. లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాల పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యల బారిన పడకుండా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

తక్కువగా తీసుకోవడం మంచిది :పాలు, పాల ఉత్పత్తులని తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే.. పాల సంబంధిత ఉత్పత్తుల్లో పోషకాలు పుష్కలం. కానీ, ఎక్కువగా తీసుకుంటే సంతృప్త కొవ్వులతో ప్రమాదం ఏర్పడవచ్చంటున్నారు. కాబట్టి ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు వీటి పరిమాణాన్ని తగ్గించడం ఉత్తమమని సూచిస్తున్నారు.

పాలకు బదులుగా వీటిని తీసుకోండి : శరీరానికి కాల్షియం అందాలంటే పాల ఉత్పత్తులు పడని వారు వాటికి బదులుగా రాగులను నానబెట్టి.. రుబ్బి తీసిన పాలు, రాగి పిండితో చేసిన జావ, రాగి మాల్ట్‌, ఓట్ మిల్క్, సోయా పాలు వంటివి తీసుకోవచ్చంటున్నారు. అలాగే రోజువారీ ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, చేపలు, బోన్ సూప్.. వంటివి తీసుకున్నా సరిపోతుందని చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడట్లేదా? - ఇలా ఇచ్చారంటే గ్లాస్ ఖాళీ చేసేస్తారు!

ABOUT THE AUTHOR

...view details