Is Banana Peel Good For Under Eyes :కంటి కింద నల్లటి వలయాలు అనేది ఇప్పుడు దాదాపు 80శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ముఖ్యంగా మహిళల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కంటి కింద క్యారీ బ్యాగులు రావడానికి అన్నిసార్లు వయసు పైబడటం మాత్రమే కారణం కాకపోవచ్చు. ఒత్తిడి, ఎక్కువగా ఏడవటం, నిద్రలేకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా కళ్ల కింది ప్రాంతం ఉబ్బినట్లుగా, కళ్లు లోపలికి వెళ్లినట్లు లోతుగా, నల్లగా కనిపిస్తుంది. కంటి కింద చర్మం చాలా సున్నితమైనది కావడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
దీంతో పాటుగా లవణం(ఉప్పు) అధికంగా ఉన్న ఆహారాలు ఎక్కువగా తినడం కూడా కణజాలాల వాపుకు దారితీస్తుంది. ఏదైమైనా కంటి కింద నల్లటి వలయాలు చూడటానికి అస్సలు బాగుండవు. ముఖ్యంగా మహిళల అందంపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కళ్ల కింది ప్రాంతం వాసి, నల్లగా కనిపించడం వల్ల వృద్ధాప్య ఛాయలను పెంచుతుంది. ఈ కారణంగానే కంటి కింద చర్మం ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకు అరటిపండు తొక్కలు బాగా సహాయపడతాయనే వీడియోలు కొన్ని ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో నిజమెంత? కంటి కింద ప్రాంతంలో అరటిపండు తొక్కలు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
కంటి కింద వలయాలను అరటితొక్క ఎలా తగ్గిస్తుంది?
అరటిపండు తొక్కలో లభించే ఓ నిర్థిష్ట సమ్మేళనం కంటి కింద చర్మాన్ని సంరక్షించేందుకు సహాయపడుతుందట. ఇందులోని టానిన్లు చర్మాన్ని బిగుతుగా, ప్రకాశవంతంగా, ధృడంగా మారుస్తాయి. వాస్తవానికి అరటిపండు తొక్కలోని టానిన్లు సహజ ఆస్ట్రిజెంట్ల లాంటివని, ఇవి చర్మ సంరక్షణలో సహాయపడతాయని ప్రముక డెర్మటాలజిస్ట్ డాక్టర్ అడెలిన్ కికామ్ తెలిపారు. IOP కాన్ఫరెన్స్ సిరీస్: మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ప్రచురించబడిన 2018 అధ్యయనం ప్రకారం, పండిన అరటి పండు తొక్కలో టానిన్ కంటెంట్ 4.69% ఉండగా, పండని అరటి తొక్కలో 6.48% శాతం ఉంటుందట.