ICMR Dietary Guidelines 2024 : ప్రస్తుత కాలంలో చాలా మంది ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కాలంతోపాటు పరుగులు తీస్తున్నారు. దీంతో సమయం దొరికినప్పుడు వేళ కానీ వేళలో ఏదో ఒకటి తింటున్నారు. కానీ.. ఇలా టైమ్‌కు సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్లే మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. మంచి ఆరోగ్యం కోసం ఏం తినాలి? అనే విషయంపై "డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్" పేరుతో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) ఒక నివేదికను విడుదల చేసింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఇందులో ICMR నిపుణుల బృందం ముఖ్యమైన సూచనలు చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మనం డైలీ తీసుకునే భోజనంలో.. కనీసం 8 రకాల ఆహార పదార్థాలు ఉండాలట. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇతరాలు కలిపి 500 గ్రాముల వరకు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో అందుబాటులో ఉండే పండ్లు 100 గ్రాములు తప్పకుండా ఉంటే మంచిదని పేర్కొన్నారు.
ఒక వ్యక్తి రోజుకి రెండువేల క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాలట. ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, నాన్‌వెజ్, గుడ్లు, నట్స్, పాలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అయితే.. ఇవన్నీ ఒకేసారి తినడం కష్టం. కాబట్టి, మూడు పూటలా ఇవి తినేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాలరీల కోసం తినాల్సిన ఆహార పదార్థాలు :
- 250 గ్రాముల తృణధాన్యాలు
- 400 గ్రాముల కూరగాయలు
- 100 గ్రాముల పండ్లు
- 85 గ్రాముల పప్పులు లేదా మాంసం లేదా కోడిగుడ్డు
- 35 గ్రాముల పప్పుగింజలు
- 27 గ్రాముల కొవ్వు పదార్థాలు లేదా నూనె
- చక్కెరల ద్వారా అందే క్యాలరీలు 5%లోపే ఉండాలని ఐసీఎంఆర్ నిపుణుల బృందం సూచిస్తున్నారు.