తెలంగాణ

telangana

ETV Bharat / health

పాపాయికి ఎక్కిళ్లు ఎంతకీ తగ్గట్లేదా? - ఐతే ఇలా చేసి చూడండి

మీ పిల్లలకు తరచూ ఎక్కిళ్లు వస్తున్నాయా? - వాటిని ఎలా అదుపు చేయాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

why do we hiccup
how to get rid of hiccups for kids (ETV Bharat)

How to Stop Hiccups in Babies :చిన్నారులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా, వారు ఏ విషయంలో ఇబ్బంది పడినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఆ సమయంలో అసలు వారికి ఏం జరిగిందో అర్థం కాని అయోమయ పరిస్థితి కొత్తగా తల్లి అయిన మహిళలది! అందుకే పసిపిల్లలను అనుక్షణం ఎంతో జాగ్రత్తగా, కంటికి రెప్పలా కాపాడుకుంటారు అమ్మలు. ఇదే టైంలో కొంతమందైతే వారి చిన్నారులకు ఎక్కిళ్లు వచ్చినా తట్టుకోలేరు. ఇంత చిన్న బుజ్జాయికి కూడా ఎక్కిళ్లు వస్తాయా? అంటూ సందేహిస్తారు. అయితే పసిపాపల్లో పుట్టినప్పటి నుంచి ఏడాది వయసొచ్చే వరకు ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమని, దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు శిశు వైద్య నిపుణులు.

బుజ్జాయికి బర్పింగ్ చేయాలి!

అది బాటిల్ ఫీడింగ్ అయినా, తల్లిపాలు తాగినా.. ఇలా చిన్నారులు పాలు తాగే క్రమంలో పొట్టలోకి కాస్త గ్యాస్ వెళ్లడం సహజం. పొట్టలో గ్యాస్ ఎక్కువ కావడం వల్ల కూడా ఎక్కిళ్లు వచ్చే ఛాన్స్​ ఉందని అంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని బయటికి పంపించడానికి చిన్నారులు పాలు తాగే క్రమంలో మధ్యమధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ బర్పింగ్ (పాపాయిని కూర్చోబెట్టి నెమ్మదిగా వెన్ను పైనుంచి కింది దాకా తట్టడం) చేయమని సలహా ఇస్తున్నారు. తద్వారా ఎక్కిళ్లు కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది. బాటిల్ ఫీడింగ్ ఇస్తున్న పాపాయికి నాలుగు టేబుల్‌స్పూన్ల పాలు తాగాక కాస్త గ్యాప్​ ఇస్తూ.. ఆ సమయంలో కాసేపు బర్పింగ్ చేయాలని, ఇక నేరుగా తల్లిపాలు తాగే బుజ్జాయిలు ఒక రొమ్ములోని పాలు తాగడం పూర్తయ్యాక కాసేపు బర్పింగ్ చేయాలని డాక్టర్లు సూచిస్తారు. ఇలా బర్పింగ్ చేసిన తర్వాత స్లోగా వెన్ను పైనుంచి కింది దాకా రాయాలి. తద్వారా వారికి పొట్టలోని గ్యాస్ బయటికి వెళ్లిపోయి కాస్త రిలీఫ్​ కలుగుతుంది.

తేనెపీకతో ఎక్కిళ్లకు చెక్​!

పాలు తాగే క్రమంలో పొట్టలోకి వెళ్లే గ్యాస్ కారణంగా శిశువులందరిలో ఎక్కిళ్లు రావని, కొంతమంది పిల్లల్లో ఎక్కువగా నవ్వడం వల్ల కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. అయితే ఇలాంటప్పుడు వారి నోట్లో ప్యాసిఫయర్ (తేనెపీక) పెట్టడం వల్ల డయాఫ్రమ్ రిలాక్సయి దానివల్ల నెమ్మదిగా ఎక్కిళ్లు తగ్గే అవకాశముందని వారంటున్నారు.

బాటిల్ చెక్ చేయండి!

చిన్నారుల్లో తరచూ ఎక్కిళ్లు వస్తున్నాయంటే వారు పాలు తాగే సీసాను కూడా ఓసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు తాగే బాటిల్ ద్వారా గాలి ఎక్కువగా పొట్టలోకి వెళ్లడం వల్ల కూడా ఈ సమస్య పదే పదే ఎదురవుతుంటుంది. కాబట్టి చిన్నారులకు నేరుగా తల్లిపాలు పట్టించడం, అలా వీల్లేని సమయంలో క్వాలిటీ బాటిల్‌ను ఉపయోగించడం మంచిది. తద్వారా ఎక్కిళ్ల సమస్య చిన్నారుల్ని వేధించకుండా కొంత జాగ్రత్తపడచ్చు.

ఎంతకీ తగ్గట్లేదా?

కొంతమంది చిన్నారుల్లో ఎక్కిళ్లు వచ్చిన కాసేపటికి వాటంతటవే ఆగిపోవటం గమనిస్తుంటాం. అలాకాకుండా ఎన్ని టిప్స్​ పాటించినా తగ్గకపోతే గనుక వారిని వెంటనే శిశువైద్యులు దగ్గరికి తీసుకెళ్లడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే కొందరు పిల్లల్లో కొన్ని హెల్త్​ సమస్యలుంటే కూడా ఎక్కిళ్లు వస్తాయంటున్నారు పిల్లల డాక్టర్లు. కాబట్టి వాటంతటవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయకుండా పదే పదే ఎక్కిళ్లు వచ్చినా, ఎక్కువసేపు తగ్గకుండా చిన్నారుల్ని ఇబ్బంది పెట్టినా వెంటనే వైద్యుడుని సంప్రదించడం మంచిది.

ఈ చిట్కాలు సైతం..

చిన్నారుల్లో ఎక్కిళ్లు పూర్తిగా రాకుండా ఉండడమనేది జరగకపోవచ్చు.. కానీ కొన్ని టిప్స్​ పాటించడం వల్ల వచ్చే అవకాశం తక్కువగా ఉందంటున్నారు వైద్యులు.

꙰ పసివాళ్లకు బాగా ఆకలేసినప్పుడే పాలు పట్టడం లేదా పాలివ్వడం.

꙰ మిల్క్​ కొద్దికొద్దిగా ఎక్కువసార్లు పట్టడం.

꙰ పాలు పట్టాక పాపాయిని కాసేపు నిటారుగా కూర్చోబెట్టడం.

꙰ బాటిల్ ఫీడింగ్ అయితే సీసా నిపుల్ పూర్తిగా బేబీ నోట్లో ఉండేలా చూసుకోవడం.. అలాగే వారికి పాలు అందుతున్నాయా లేదా గమనించడం.

Note :ఒకవేళ ఏం చేసినా ఎక్కిళ్లు తగ్గకపోతే మాత్రం తక్షణమే వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం మంచిదన్న విషయం గుర్తుంచుకోండి.

ఇష్టమైన పాట పాడుతూ చేతులు కడుక్కుంటే ఎన్ని లాభాలో తెలుసా!

జుట్టు ఎక్కువగా రాలిపోతోందా? ఐతే ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి

ABOUT THE AUTHOR

...view details