How to Reduce Infections in Body:ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ఇన్ఫెక్షన్స్ అంటే.. బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు లేదా పరాన్నజీవులు వంటి రోగకారక మూలకాలు శరీరంలోకి ప్రవేశించి.. అక్కడ పెరిగి, శరీర కణాలకు హాని కలిగించడం. ఇవి చిన్న చిన్న జలుబు నుంచి ప్రాణాంతక వ్యాధుల వరకు కారణమవుతాయి. అయితే ఇన్ఫెక్షన్ల సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంది ఆసుపత్రులకు వెళ్తుంటారు. అయితే ఈ సమస్యకు ఇంట్లోని పదార్థాలతోనే ఔషధం తయారు చేసుకోవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. ఈ ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం
కావాల్సిన పదార్థాలు
- అర కప్పు బియ్యం
- ఒక చెంచా విడంగాల చూర్ణం
- ఒక చెంచా పిప్పళ్లు చూర్ణం (నేతిలో వెయించినవి)
- ఒక చెంచా మిరియాల పొడి
- కొన్ని మునగ ఆకులు
- రుచికి సరిపడా సౌవర్చ లవణం పొడి
- మజ్జిగ
తయారీ విధానం
- ముందుగా స్టౌ వెలిగించి కడాయిని పెట్టి నాలుగు కప్పుల నీటిని పోయాలి.
- నీరు బాగా మరిగాక ఇందులో అరకప్పు బియ్యం, మునగ ఆకులు వేసి ఉడికించుకోవాలి.
- బియ్యం ఉడికిన తర్వాత అందులోనే విడంగాల చూర్ణం, మిరియాల పొడి, పిప్పళ్ల చూర్ణం వేసుకోవాలి.
- ఆ తర్వాత బాగా కలిపి సుమారు 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- అనంతరం చివర్లో రుచికి సరిపడా సౌవర్చ లవణం వేసి కలిపి దించేసుకోవాలి.
- దీనిని మరో గిన్నెలోకి తీసుకుని కాస్త చల్లారక అవసరమైనంత మజ్జిగను పోసుకుని కలపాలి.
ఈ ఔషధాన్ని ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు.. రోజు ఆహారం లాగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రోజులో కనీసం ఒక్కసారి.. వీలైతే రెండు సార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి త్వరగా శక్తిపుంజుకోవడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
మునగ ఆకులు:మునగ ఆకులకు ఇన్ఫెక్షన్లను తగ్గించే గుణం బాగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు మలినాలను తొలగించే డీటాక్స్ టానిక్ లాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.