How To Protect Eyes From Gigital Screen :ఈ రోజుల్లో దాదాపు అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. ఉదయం నిద్రలేవగానే చేతిలోకి ఫోన్ తీసుకుంటున్నారు. ఆఫీసు, ఇల్లు ఎక్కడున్నా గంటల తరబడి కంప్యూటర్, ల్యాప్‌టాప్‌కు అతుక్కుపోతున్నారు. కాస్త వీలు దొరికితే టీవీ ముందు సెటిలైపోతున్నారు. ఇక పిల్లలైతే చెప్పనవసరం లేదు. మొబైల్‌లో వీడియోలు, గేమ్‌లతో గంటల తరబడి గడిపేస్తున్నారు. ఇలా రోజులో చాలా భాగం డిజిటల్ స్క్రీన్‌ల ముందు గడిచిపోతోంది. ఇలాంటి లైఫ్‌స్టైల్ మన కళ్లకు అంత మంచిది కాదు. గంటల తరబడి డిజిటల్ స్క్రీన్‌లు చూస్తుంటే కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది.
డిజిటల్ స్క్రీన్‌ల నుంచి కళ్లను కాపాడుకోవడం ఎలా?
రోజులో ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్‌లను చాలా దగ్గరగా చూడటం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది. ఇతర చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. డిజిటల్ డివైజ్‌ల వినియోగం తగ్గించాలి. ఫోన్‌లు, కంప్యూటర్‌లు, ల్యాప్‌ట్యాప్ ఎక్కువ సేపు వినియోగిస్తే కళ్లలో నొప్పి, చూపు మందగించడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్క్రీన్ ఎక్కువ సేపు చూస్తుంటే చిన్నప్పటి నుంచే దృష్టిలోపాలు మొదలవుతాయి. వయసు పెరిగే కొద్దీ కచ్చితంగా కళ్లద్దాలు వినియోగించాల్సి వస్తుంది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లను త్వరగా పొడిబారేలా చేస్తుంది. దీంతో కళ్లు మండుతున్నట్లు, గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది.
కళ్లను కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎక్కువ సేపు కంప్యూటర్, ఫోన్ వాడుతున్నప్పుడు ప్రతి అరగంటకు ఓ సారి కాసేపు విశ్రాంతి తీసుకోండి. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ నుంచి బయట దూరంగా కనిపించే దృశ్యాలపై దృష్టి సారించండి. కంప్యూటర్ స్క్రీన్ మరీ ఎక్కువ బ్రైట్‌గానూ, డార్క్‌గానూ ఉండకుండా చూసుకోండి. కంప్యూటర్ మానిటర్ నుంచి వచ్చే లైట్ నేరుగా కళ్ల మీద పడకుండా యాంటీ గ్లేర్ స్క్రీన్ యూజ్ చేయండి. రాత్రి పూట సాధ్యమైనంత వరకు డిజిటల్ డివైజ్‌లను ఉపయోగించకండి.