How To Prevent Childhood Obesity : పిల్లలు బొద్దుగా ఉంటేనే బాగా కనిపిస్తారు. చాలా మంది ఇలానే అభిప్రాయపడతారు. ఇదే నమ్మకంతో వారు ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ బరువున్నా పట్టించుకోం. పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా బరువు అనేది ఆరోగ్యానికి గుదిబండే. అందుకే స్థూలకాయం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. చిరుతిళ్లు, జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పిల్లల ఒంట్లో కొవ్వు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలో స్థూలకాయానికి దారితీస్తున్న మార్గాలు, బరువు తగ్గించుకునే మార్గాల గురించి తెలుసుకుందాం. అధిక బరువు, స్థూల కాయం, ఉబకాయం ఇలా పేరేదైనా సమస్య ఒక్కటే. ఈ కాలంలో ఈ సమస్య పెద్దలకే కాదు పిల్లలకూ గుది బండలా మారుతోంది. ఒకవైపు పిల్లల మీది ప్రేమతో వారు కోరినవన్నీ తినిపించడం, అతిగా జంక్ ఫుడ్‌ను అలవాటు చేయడం మరోవైపు ఆటలు, శారీరక వ్యాయామాలు లేకపోవడంతో పిల్లలు సులభంగా బరువు పెరిగిపోతున్నారు.
కారణాలు అనేకం
'కొంత మంది పిల్లల్లో థైరాయిడ్, పిట్యుటరీ గ్రంథుల్లో సమస్యలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లోనూ వారు బరువు పెరిగిపోతూ ఉంటారు. పిల్లల్లో టైప్-1 మధుమేహం ఉన్నప్పుడు కూడా బరువనేది సమస్యగా మారుతుంది. క్యాన్సర్ కాని కొన్ని కణితులు మెదడులో హైపోథలమస్ ప్రాంతంలో పెరిగినా పిల్లలు బరువు పెరుగుతారు. ఈ సమస్య ఉన్నప్పుడు ఆకలి తీరిన సమాచారం మెదడుకు అందక వారు ఆపకుండా తింటూనే ఉంటారు. ఇది క్రమంగా స్థూలకాయానికి దారి తీస్తుంది' అని వైద్యులు చెబుతున్నారు.
సమస్యలివే
స్థూలకాయం అనేది బలం అని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ అది నిజం కాదు. అది పిల్లల శరీరంలో అనేక రుగ్మతల్ని తెచ్చి పెడుతుంది. స్థూల కాయంతో బాధపడే పిల్లలు శరీరాన్ని బలంగా లాగుతున్నట్లు నడుస్తారు. నిద్రలో గురక పెడుతూ ఉంటారు. నిద్రలో ఊపిరి అందక హఠాత్తుగా లేచి కూర్చుంటారు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. తరచూ ఆయాస పడుతుంటారు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు.