How can I Exercise with No Money:మీరు ఫిట్‌గా, హెల్దీగా ఉండాలని చూస్తున్నారా? ఇంకా సిక్స్ ప్యాక్ కావాలని ఉందా? కానీ ఇందుకోసం రకరకాల పరికరాలు, ఉత్పత్తులను కొనక తప్పదేమో అని అనుకుంటారు. వాటి ధరలను చూసి చాలా మంది భయపడుతుంటారు. అసలు కసరత్తు చేయడమే కష్టం అనుకుంటే ఇంత డబ్బులు వెచ్చించాలా అని ఆలోచిస్తుంటారు. ఇకపై మీరు ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. పెద్దగా ఖర్చు లేకుండానే చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉచిత మార్గాలు:లాంటి ఖర్చు లేని అత్యుత్తమ వ్యాయామం వాకింగ్. ఇంకా వేగంగా నడిచే బ్రిస్క్ వాక్ చేయడం వల్ల గుండె బలోపేతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 2017లో Journal of Sports Science and Medicine ప్రచురితమైన "Walking and cardiovascular health: a systematic review" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ప్రకృతిలో నడవడం వల్ల స్థైర్యం పెరిగి.. ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా ఆందోళనను తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. కార్డియో వర్కవుట్లలో రన్నింగ్ చాలా మంచిదని సూచిస్తున్నారు. ప్రతి రోజు 10 నిమిషాల పరిగెత్తడం వల్ల గుండె వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇందుకు ట్రెడ్‌మిల్ మీద వేలు ఖర్చు అవసరం లేదని.. మంచి షూస్ ఉంటే సరిపోతుందని వివరిస్తున్నారు. ఇవే కాకుండా కొన్ని బాడీవెయిట్ వ్యాయామాలు, ఫిట్‌నెస్ వీడియోలు వంటివి అతి తక్కువ ఖర్చుతో ప్రేరణని, ప్రయోజనాలను ఇస్తాయని సలహా ఇస్తున్నారు.
కొద్ది ఖర్చుతో:కొంత మందికి జిమ్‌లకు వెళ్లడం ఇష్టం ఉండదు. అలాంటి వారు తక్కువ ఖర్చుతో హోం జిమ్ ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరికరాలకు నిర్వహణ వ్యయాలూ ఉండవని.. అలాంటివి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం డంబెల్స్, రెసిస్టెన్స్ బాండ్స్, జంప్ రోప్స్, కెటిల్ బెల్స్, యోగా మాట్ ఇంట్లో ఉంటే చాలని సూచిస్తున్నారు. ఇంకా వీటి కొనుగోళ్లపై కొన్ని డిస్కౌంట్ సైట్లు, ఈ వాలెట్లు కూపన్లు ఇస్తూంటాయని.. వాటిలో జిమ్ మెంబర్ షిప్‌లపై ఆఫర్లు ఉంటాయని అంటున్నారు. మరికొన్ని సంస్థలు ఉద్యోగుల ఆరోగ్య స్కీమ్‌లలో జిమ్ మెంబర్ షిప్‌లకు, ఫిట్‌నెస్ క్లాసులకు రాయితీలు, రీఇంబర్స్‌మెంట్ ఇస్తాయని తెలిపారు. బీమా పాలసీల్లో కూడా ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని వివరిస్తున్నారు.
బాడీ వెయిట్ వ్యాయామాలు:డంబెల్స్, రాడ్స్, వెయిట్స్ ఇలా ఏ పరికరాలూ లేకపోయినా.. శరీర బరువు ఆధారంగానే మంచి వ్యాయామాలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కాలిస్తనిక్స్ అని పిలుస్తుంటారు. కొందరు వాటితో పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతుంటారు. కానీ, నిజానికి ఇవి చాలా కష్టమని.. ఒక్కసారి చేసి చూస్తే మీకే తెలుస్తుందని నిపుణలు అంటున్నారు. ఇవన్నీ గుండె వేగాన్ని పెంచి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని వివరిస్తున్నారు. వీటిలో ప్రాథమిక వ్యాయామాలతో మొదలుపెట్టి పెంచుకుంటూ వెళ్లాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇవి నడుము పటుత్వాన్ని మెరుగు పరిచి.. కండరాలకు బలాన్ని, ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయని అంటున్నారు. ఇందుకోసం పుష్-అప్స్, ప్లాంక్స్, స్క్వాట్స్, రష్యన్ ట్విస్ట్స్, బర్పీస్ ప్రయత్నించాలని సూచిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లోలా వీటితో త్వరగా ఫలితాలు రావని.. కాస్త ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. కానీ మిగతా వ్యాయామాలతో పోలిస్తే వీటితో గాయాల ప్రమాదం ఉండదని తెలిపారు.
చవక మార్గాలెన్నో:మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలంలో ఆసక్తి ఉన్న వారితో కలిసి షటిల్, వాలీబాల్ ఆడవచ్చని, వాకింగ్ క్లబ్‌లో చేరచ్చని సూచిస్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ జిమ్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇంకా సమీపంలోని మున్సిపల్, కమ్యూనిటీ జిమ్స్‌లో ఫీజులు చవగ్గా ఉంటాయని.. అక్కడ చేసుకోవచ్చని చెబుతున్నారు.