How To Build Confidence in Children : కొంత మంది పిల్లలు చదువులో ముందు వరసలో ఉంటారు. కానీ.. బయట ఏ పని చేయాలన్నా కూడా ఎంతో భయపడుతుంటారు. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అని సిగ్గు పడుతుంటారు. అయితే.. ఇలా పిల్లలు తమకు సామర్థ్యం ఉన్నా కూడా వెనకడుగు వేయడానికి ఆత్మవిశ్వాసం లోపించడమే కారణమని నిపుణులంటున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి తల్లిదండ్రులే కృషి చేయాలని చెబుతున్నారు. దీనివల్ల వారు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొని విజయంసాధిస్తారని పేర్కొన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ప్రేమ, మద్దతు అందించండి :
ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి ఎవరైనా కూడా చాలా ధైర్యంగా ఉంటారు. వారు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, సవాళ్లను ఎదుర్కొవాడినికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే.. ఈ అలవాటును తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలి. అందుకు అనుగుణంగా కృషి చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ప్రేమ, మద్దతును అందించి కొత్త విషయాలను నేర్చుకునేలా ప్రేరేపించాలని అంటున్నారు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రశంసించండి :
పిల్లలు పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించినా, అలాగే ఆటల్లో చురుకుగా పాల్గొన్న కూడా వారిని ప్రశంసించండి. దీనివల్ల మీరు వారి వెంట ఉన్నారని పిల్లలకు తెలుస్తుంది. అయితే.. కొన్నిసార్లు పిల్లలుఫెయిల్ అయినా కూడా వారిని నిరుత్సాహపరచకుండా.. మరోసారి ట్రై చేయమని ప్రోత్సహించండి. జీవితంలో గెలుపోటములు సహజమని.. కానీ, ప్రయత్నం మాత్రం ఎప్పటికీ విడవకూడదని చెప్పాలి.
స్వేచ్ఛను అందించండి :
పిల్లలు ఎప్పుడూ మీపైనే ఆధారపడి ఉండకుండా.. వారే స్వయంగా కొన్ని సొంత నిర్ణయాలు, బాధ్యతలను తీసుకునేలా స్వేచ్ఛను అందించండి. వారికి నచ్చిన డ్రెస్ కలర్‌ను ఎంపిక చేసుకోవడం, స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం, షూ పాలిష్ చేసుకోవడం వంటివి చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా సొంత పనులు చేసుకోవడం వల్ల వారు మంచి, చెడు విషయాలను కూడా నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
ఇతరులతో పోల్చకండి :
చాలా మంది తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తమ పిల్లలను ఇతరులతో పోల్చుతుంటారు. కానీ, ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ముందుగా పిల్లలను వాళ్లకు వాళ్లు నచ్చేలా తీర్చిదిద్దండి. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.