How Much Water To Drink In Summer :వేసవి కాలం వచ్చిందంటే చాలు నీటిని ఎక్కువగా తాగుతుంటాం. దాహం తీరడమే కాకుండా, సూర్యుని తాపాన్ని తట్టుకొని శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలంటే నీరును పుష్కలంగా తాగాల్సిందే. అయితే చాలామంది మనసులో మెదిలే ప్రశ్న ఏంటంటే మనిషి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? నిజానికి రోజుకు ఎంత మోతాదులో నీరు తాగాలనేది అందరికీ ఒకేలా ఉండదట. ఫలానా వాళ్లు ఎక్కువ నీరు తాగాలి ఫలానా వాళ్లు తక్కువ తాగాలి అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.
సగటున మనిషికి ఎంత నీరు అవసరం?
సాధారణంగా మనిషి ప్రతిరోజూ 6గ్లాసులు వరకు కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే తాగాలి. ఆరోగ్యంగా ఉండేవారందరూ రోజుకు 4 నుంచి 6 గ్లాసుల నీటిని నేరుగా తాగుతుంటారు. ఇవే కాకుండా ఆహారం, పండ్ల రసాల రూపంలో ఇంకొన్ని నీటిని తీసుకోవాలి. అంటే టీ, కాఫీలు, పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు లాంటి ఇతర నీరు కలిగిన ఆహార పదార్థాలన్నీ కలిపి పురుషులు రోజుకు 15.5 గ్లాసుల నీరు తాగాల్సి ఉండగా, స్త్రీలు 11.5 గ్లాసుల నీటిని శరీరంలోకి పంపించాల్సి ఉంటుంది. ఇది మాములు మసుషుల సంగతి.
అనారోగ్య సమస్యలు ఉన్నావారు ఎంత నీటికి తీసుకోవాలి?
ఇక వ్యాయామాలు, శారీరక శ్రమ అధికంగా చేసేవారు (చెమట పట్టేలా కష్టపడి పనిచేసేవారు) ఇంకా ఎక్కువ నీరు తీసుకోవాల్సి ఉంటుందట. అలాగే బయట వేడి ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ దాహం వేసినప్పుడు కచ్చితంగా ఇంకాస్త ఎక్కువ నీటిని తాగాలి. ఇవే కాకుండా వయసు పైబడిన వారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ మెడిసిన్ వేసుకునే వారు తీసుకోవాల్సిన నీటి శాతం వేరుగా ఉంటుంది. థైరాయిడ్, కిడ్నీ, కాలేయ సమస్యలు లాంటివి ఉన్నవారు వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రోజుకు ఎంత నీరు తాగాలో వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.