How Liver Damage With Alcohol :ఆరోగ్యంపై మద్యం ఎంతగా దష్ప్రభావం చూపుతుందో? ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో తెలిసిందే. అయినప్పటికీ.. చాలా మంది మద్యపానాన్ని మానుకోలేరు. అదొక వ్యసనంగా మారిపోతుంది. చివరకు ఊబిలా మారిపోతుంది. అందులో నుంచి బాధితులు బయటపడలేరు. మద్యం వల్ల ముందుగా దెబ్బతినే అవయవం లివర్. మరి.. ఇది దశల వారీగా ఎలా నాశనం అవుతుంది? దాని ఫలితం మనిషిపై ఎలా పడుతుంది? అన్నది ఇప్పుడు చూద్దాం.
ఫ్యాటీ లివర్..
ఆల్కహాల్ తీసుకునే చాలా మందిలో నియంత్రణ ఉండదు. ఎంత తీసుకుంటారనేది క్లారిటీ ఉండదు. ఎక్కువగా మద్యం తాగడం వల్ల దాన్ని ప్రాసెస్ చేయడానికి కాలేయం చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది మరింతగా తాగినప్పుడు.. అది కాలేయం కణాల లోపల కొవ్వుగా మారుతుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) 2017లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. దీర్ఘకాలంగా రోజూ అతిగా మద్యం తాగుతున్న వారిలో ఫ్యాటీ లివర్ త్వరగా ఏర్పడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తీసుకునే వారిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుందట. అయితే.. తొలినాళ్లలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. పరిస్థితి తీవ్రమవుతున్నప్పుడు కడుపులో అసౌకర్యం, బరువు తగ్గడం, అలసట వంటివి బాధిస్తుంటాయి. దశలు దాటుతున్నకొద్దీ ఈ బాధలు పెరుగుతుంటాయి.
లివర్ ఫైబ్రోసిస్..
ఫ్యాటీ లివర్ కండిషన్ తర్వాత కూడా అదే స్థాయిలో మద్యం తాగుతూ వెళ్తే.. కాలేయంపై మచ్చలు ఏర్పడతాయి. దీన్నే లివర్ ఫైబ్రోసిస్ అంటారు. అమెరికన్ లివర్ ఫౌండేషన్ ప్రకారం.. ఫైబ్రోసిస్ కు చికిత్స చేయకపోతే.. అది సిర్రోసిస్ దశలోకి, ఆ తర్వాత కాలేయ క్యాన్సర్‌కూ దారి తీస్తుంది.
లివర్ పునర్నిర్మాణం..
నిజానికి లివర్ తనని తానే పునర్నించుకునే కెపాసిటీ ఉన్న అవయవం. దెబ్బతిన్నా.. తగినంత సమయం ఇస్తే తిరిగి కోలుకోగలదు. కానీ.. ఆ సమయం కూడా దానికి ఇవ్వకుండా నిరంతరం మద్యం పోసేస్తుంటే.. దాన్ని ప్రాసెస్ చేయలేక అలసిపోతుంది. అయినా.. లిక్కర్ తీసుకోవడం కొనసాగిస్తే.. కాలేయం నిరంతర వాచి ఉండడం.. దెబ్బతినడం జరుగుతుంది. ఇక.. దానికదే రిపేర్ చేసుకోలేని కండీషన్లోకి వెళ్లినప్పుడు.. ఫైబ్రోసిస్ డెవలప్ అవుతుంది. లివర్ పై ఏర్పడే ఈ మచ్చలు.. బ్లడ్ సర్క్యులేషన్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి.