Food Avoid For High Blood Pressure Patients :నేటి ఆధునిక జీవితంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. చదువు, ఉద్యోగం, వ్యాపారం అంటూ చాలా మంది తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎక్కువ మంది ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ తీసుకోవడం లేదు. దీనివల్ల సమయానికి సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం లేదు. ఫలితంగా.. అధిక రక్తపోటుకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని 'అమెరికన్ హార్ట్ అసోసియేషన్' సూచిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉప్పు..
అధిక రక్తపోటు పెరగడానికి ఉప్పు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. రోజూ 2,300 mg కంటే ఎక్కువ ఉప్పు తినకూడదని అంటున్నారు. లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వెంటాడతాయట.
జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు..
అధిక రక్తపోటు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో జంక్‌ఫుడ్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. బ్రెడ్, పిజ్జా, శాండ్విచ్లు, సూప్, టాకోస్ వంటి వాటిని తినకుండా ఉండాలని తెలియజేస్తున్నారు. అలాగే తీపి ఎక్కువగా ఉండే పదార్థాలు, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ వాటికి దూరంగా ఉండాలట. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్యకరమైన బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మద్యం ఎక్కువగా తాగడం..
హై బీపీ పేషెంట్లు అధికంగా మద్యం సేవించడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉండదని అంటున్నారు. అలాగే ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
పొగకు దూరంగా ఉండాలి..
సిగరెట్ వంటి వాటిని తాగడం వల్ల రక్తపోటు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం మరింత పాడైపోతుందని అంటున్నారు. అందుకే ఇలాంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు.