తెలంగాణ

telangana

ETV Bharat / health

రోజుకో పెగ్గు ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? - ALCOHOL GOOD FOR HEALTH OR NOT

-మద్యం సేవించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? -ఏ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?

Alcohol Good for Health or Not
Alcohol Good for Health or Not (Getty Images)

By ETV Bharat Health Team

Published : Dec 19, 2024, 12:58 PM IST

Alcohol Good for Health or Not: రోజుకో పెగ్గు తాగితే ఆరోగ్యంగా ఉంటారని.. మితంగా మద్యం తీసుకోవడం గుండెకు మంచిదని చాలా మంది అంటుంటారు. నిజానికి మొదట్లో మితంగానే తీసుకుంటున్నా.. కాలం గడిచేకొద్ది మోతాదులు పెరిగిపోతూ వీడలేని వ్యసనంగా మారుతుంది. ఫలితంగా అనేక వ్యాధులకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. అసలు మితంగా మద్యం తీసుకుంటే గుండెకు మంచిదనే నమ్మకంలో నిజమెంత? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఆల్కహాల్​ను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి కొన్ని మంచి ప్రయోజనాలు కలుగుతాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేశ్ గూడపాటి అంటున్నారు. కానీ ఒక మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అంతే నష్టం కలిగే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఆల్కహాల్​ను తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయని వివరిస్తున్నారు. ఇంకా రక్త పోటు తగ్గుతుందని వివరిస్తున్నారు. అదే పద్ధతిలో ఆల్కహాల్​ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అంతే స్థాయిలో నష్టాలు ఉంటాయని అంటున్నారు. బరువు, బీపీ, షుగర్ స్థాయులు పెరుగుతుంటాయని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా గుండె రక్త నాళాల్లో పూడికలు ఏర్పడి గుండెపోటులు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఎక్కువగా తీసుకునేవారిలో గుండె కండరాలు బలహీన పడి సామర్థ్యం తగ్గిపోయి.. సమస్యలు వస్తాయని అంటున్నారు.

"ఆల్కహాల్​లో విస్కీ, బ్రాండీ, వైన్, బీర్ ఇలా రకరకాలు ఉంటాయి. వీటన్నింట్లో ఆల్కహాల్ మోతాదులు మారిపోతుంటాయి. విస్కీలో 40 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అదే వైన్​లో 14-16 శాతం, బీర్​లో 7-8 శాతం ఆల్కహాల్ ఉంటుంది. సగటున రోజుకు మహిళలు 45 మిల్లీ లీటర్లు, పురుషులు అయితే 90 మిల్లీ లీటర్లు లోపు ఆల్కహాల్ తీసుకుంటే శరీరానికి ఎక్కువ నష్టం జరగదు."

--డాక్టర్ రమేశ్ గూడపాటి, సీనియర్ కార్డియాలజిస్ట్

రెడ్ వైన్ గుండెకు మంచిదా?
వైన్​లో ముఖ్యంగా రెడ్ వైన్​లో పాలీఫినాయిల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్​ఫ్లామేటరీ గుణాలు ఉంటాయని.. ఇవి రక్త నాళాల్లో పూడికలు కాకుండా సాయం చేస్తాయని వివరిస్తున్నారు. ఈ పాలీ ఫినాయిల్స్ మిగతా ఆల్కహాల్స్​లో తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అందుకే మిగతా వాటితో పోలిస్తే రెడ్ వైన్ కాస్త ఆరోగ్యానికి మంచి చేస్తుందని అంటున్నారు.

అయితే, తక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు.. సరైన ఆహారం, వ్యాయామంతో కూడా పొందవచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అందుకే ఆల్కహాల్ అలవాటు లేని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని మొదలు పెట్టకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ ఆల్కహాల్ అలవాటు ఉంటే తక్కువ మోతాదులో తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆల్కహాల్ వల్ల కేవలం గుండె ఆరోగ్యానికే కాకుండా అనేక అవయవాలపైనా ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీకు నిద్రలో చెమటలు పడుతున్నాయా? లేట్ చేయకుండా ఆస్పత్రికి వెళ్తే బెటర్!

హార్ట్ ఎటాక్ తెల్లవారుజామునే ఎందుకు వస్తుందో తెలుసా? గుండెపోటు వస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలట!

ABOUT THE AUTHOR

...view details