Health Benefits of Sleeping With Socks at Night : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా మంది చలి తట్టుకోలేక రాత్రిపూట స్వెటర్లు, మఫ్లర్లు ధరించి నిద్రపోతూ ఉంటారు. అయితే, కొంతమంది పడుకునేటప్పుడు వాటితో పాటు కాళ్లకు సాక్సులు కూడా వేసుకుంటుంటారు. నిద్రపోయేటప్పుడు సాక్సులువేసుకుంటే చలి నుంచి ఉపశమనం లభించడంతో పాటు వెచ్చగా, హాయిగా ఉంటుందని ఇలా చేస్తుంటారు. ఇంతకీ, రాత్రిపూట సాక్సులు వేసుకొని నిద్రించడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిజానికి రాత్రిపూట సాక్స్‌లు వేసుకొని నిద్రించడం కొంత వరకు చలిని తగ్గించి, పాదాలు వెచ్చగా ఉండడానికి సహాయపడుతుంది. కంఫర్ట్‌గా ఉంటుంది. అంతేకాదు, నిద్రించే టైమ్‌లో కాళ్లకు సాక్సులు వేసుకోవడం ద్వారా ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. అలాంటి వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే..
మంచి నిద్రకు ఉపకరిస్తుంది :వింటర్లో చాలా మంది చలి కారణంగా సరిగ్గా నిద్రపోరు. అలాంటి వారు పడుకునే ముందు కాళ్లకు సాక్సులు ధరించి నిద్రిస్తే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సాక్సులు వేసుకోవడం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి పాదాలను వెచ్చగా ఉండేలా చేస్తుంది. ఇది మీరు త్వరగా నిద్ర పోవడానికి ఉపకరిస్తుందంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్‌లో కూడా రాత్రిపూట సాక్సులు ధరించడం వల్ల పాదాల ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మంచి నిద్రను పొందడానికి సహాయపడుతుందని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రక్త ప్రసరణ మెరుగు :శీతాకాలం రాత్రిళ్లు పాదాలు చలి కారణంగా చల్లగా అవుతాయి. దాంతో రక్త నాళాలు సంకోచం చెంది.. రక్త ప్రసరణ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, రాత్రిపూట కాళ్లకు సాక్సులు వేసుకొని నిద్రిస్తే రక్త ప్రసరణ మెరుగుపడడానికి తోడ్పడుతుందట. బాడీలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే.. అన్ని అవయవాలకు రక్తం, ఆక్సిజర్ సరఫరా సాఫీగా సాగుతుంది. ఫలితంగా గుండె, లంగ్స్, కండరాల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు.