Common Mistakes Of Cooking Rice: వంట చేసామా, తిన్నామా అని కాకుండా, వండిన ఆహారం ఆరోగ్యకరంగా, రుచిగా ఉందా లేదా అనేది కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా భారతీయుల వంటగదిలో ప్రధాన పదార్థమైన అన్నం వండటం అందరూ అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. వండుతున్నప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా అన్నం తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. బియ్యంతో మీరు బిర్యానీ చేసినా, పులావ్ చేసినా, బగారా రైస్ చేసినా చివరకు వట్టి అన్నం వండినా అది పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని చిట్కాలు తప్పక పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. కొన్ని పొరాపాట్లు చేయకుండా ఉండే అన్నం ఆరోగ్యకరంగా, రుచిగా అవుతుందని చెబుతున్నారు.
నీటి పరిమాణం
అన్నం వండటంలో నీటి పరిమాణం చాలా ముఖ్యం. నీళ్లు కొంచెం ఎక్కువైతే అన్నం గుజ్జుగుజ్జుగా అవుతుంది, అలాగని తక్కువైతే గింజలు గింజలుగా ఉంటుంది. అందుకే నీరు సరిపడా ఉండేలా చూసుకోవాలి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుడు లేదా ఒకటిన్నర కప్పుల నీరు పోస్తే అన్నం చక్కగా ఉంటుంది.
నానబెట్టకుండా వండటం
ఈ మధ్యకాలంలో చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే బియ్యం నానబెట్టకుండానే వండటం. అన్నం రుచిగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే బియ్యం నానడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బిర్యానీ వంటి మసాలాలతో కలిపి వండుతున్నప్పుడు బియ్యం ఎంత బాగా నానితే అంత చక్కగా ఉంటుంది. అలాగే అన్నం త్వరగా కూడా ఉడుకుతుంది.
ఉప్పు వేయకుండా వండటం
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అన్నం వండేముందు ఉప్పు వేయడం ఆరోగ్యకరమైన అలవాటు. ఉప్పు వేసి వండటం వల్ల అన్నం మంచిగా ఉడకడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది.
ఎక్కువ మంట మీద వండటం
టైం లేదనో ఆకలేస్తుందనో అన్నాన్ని ఎప్పుడూ హై ఫ్లేంలో వండకూడదు. బియ్యం ఆరోగ్యకరంగా, రుచిగా ఉండాలంటే ఎక్కువ సేపు ఉడికించాలి. ఎక్కువ మంట మీద ఉడికించడం వల్ల బియ్యం పోషకాలను కోల్పోయే అవకాశాలున్నాయి.