Can Walking Cause Knee Problems :నడక మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల బరువు అదుపులో ఉండడం, రక్తప్రసరణ బాగా జరగడంతోపాటు, శరీరం తేలికగా, ఉల్లాసంగా ఉంటుంది. అందుకే పిల్లలు పెద్దలందరూ తప్పకుండా ఉదయాన్నే వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే, కొంతమంది డైలీ ఎక్కువ దూరం నడవడం వల్ల మోకాళ్లు అరిగిపోతాయని అనుకుంటుంటారు. నిజంగానే ఎక్కువ దూరం నడవడం వల్ల కీళ్లు అరిగిపోతాయా ? మోకాళ్లు అరిగిపోయిన వారు వాకింగ్ చేయోచ్చా? అనే ప్రశ్నలకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ 'డాక్టర్ సునీల్ దాచేపల్లి' సమాధానం చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
నడిస్తేనే మోకాళ్లకు ఆరోగ్యం!
మన సమాజంలో కొంతమంది డైలీ ఎక్కువ దూరం నడవడం వల్ల కాళ్లు అరిగిపోతాయని భావిస్తుంటారు. కానీ, ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని డాక్టర్ సునీల్ చెబుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నడవాలి. ప్రతిరోజు నడిస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మోకాళ్లు అరిగిపోయిన వారు కూడా నడవాలని డాక్టర్ సునీల్ సూచిస్తున్నారు. రోజూ నడవడం వల్లే మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కాస్త నొప్పి తగ్గుతుంది.
2022న ఆర్థరైటిస్ అండ్ రుమటాలజీ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు రోజూ నడవడం వల్ల నొప్పి కొంత తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
"వయసులో ఉన్న వారు ఎంత దూరమైనా నడవచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, వయసు పైబడిన వారు నడిచినప్పుడు మోకాళ్లలో నొప్పి కలిగితే కాసేపు ఆగిపోయి కూర్చోవాలి. తర్వాత మళ్లీ కొంత దూరం నడవాలి. మోకాళ్ల నొప్పులున్న వారు నడవడం వల్ల కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి. దీనివల్ల నొప్పి కొంత వరకు తగ్గుతుంది. మృదులాస్థి గట్టిపడి తొందరగా అరిగిపోకుండా ఉంటుంది." - డాక్టర్ సునీల్ దాచేపల్లి
- రోజూ వాకింగ్ చేయకపోవడం వల్ల మోకాళ్లు అరిగిపోయిన వారిలో కండారాలు, ఎముకలు సన్నబడిపోతాయి. అలాగే కాల్షియం తగ్గిపోతుంది. దీనిని ఆస్టియోపోరోసిస్ అని అంటారు.
- దీంతో మోకాళ్లు, తుంటి భాగాల్లో ఎముకలు త్వరగా అరిగిపోతాయని డాక్టర్ సునీల్ వివరిస్తున్నారు. అందుకే ప్రతిఒక్కరూ నడవాలని చెబుతున్నారు.
- వయసు పైడిన వారు రన్నింగ్, జాగింగ్ వంటివి మొదటి నుంచి అలవాటు ఉంటేనే చేయాలి.
- అప్పటికప్పుడూ స్టార్ట్ చేయకూడదు. వీటికి బదులుగా కాస్త వేగంగా నడిస్తే సరిపోతుందని డాక్టర్ సునీల్ పేర్కొన్నారు.