Bottle Gourd Dosa For Weight Loss: మారుతున్న జీవన శైలిలో భాగంగా ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ పూర్తిగా తగ్గడం. ఇలా అనేక కారణాల వల్ల ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారందరు ఇబ్బంది పడుతున్న సమస్య అధిక బరువు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా చాలా మంది ఆహారపు అలవాట్లు మార్చుకోవడం లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే, బరువు తగ్గాలనుకునే వారు లైట్ ఫుడ్, అన్నం తక్కువ తినాలని అనుకుంటారు. మరి దానికి బదులుగా దోశ తినొచ్చా అనే అనుమానం కొందరిలో ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మనం చేసుకునే దోశలో మూడు వంతుల వరకూ బియ్యం, ఒక వంతు మినప పప్పు ఉంటుంది. ఇది తింటే అన్నం తిన్నట్లేనా అనే సందేహం చాలా మందిలో మెదులుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్లు లేకుండా చూసుకోవాలి. అలాగే కడుపు నిండుగా కాకుండా శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ మాత్రమే తినాలి. అలాగే తినే ఆహారంలో పోషకవిలువలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
దోశ తినొచ్చా?
చాలా మందికి ఇష్టమైన టిఫిన్లలో దోశ ఒకటి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దోశ తినాలనే ఆశను చంపుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా బియ్యం, పప్పుతో తయారు చేసిన దోశను కాకుండా, ఎక్కువ పోషక విలువలు కలిగిన ఇతర పదార్థాలతో తయారు చేసిన దోశ అయితే మీ డైట్ ప్లాన్‌ను చెడగొట్టకుండా ఉంటుంది. ఉదాహరణకు సొరకాయ, పెసరపప్పు దోశ. ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. సొరకాయలో అధిక నీటితో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండాలనుకుంటే ఇది చక్కటి ఎంపికగా సూచిస్తున్నారు డైటీషియన్లు. దీంట్లో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయట. అందుకే బరువు తగ్గాలనుకునే వారు నిస్సందేహంగా ఈ దోశను తినచ్చు.
ప్రయోజనాలు
ఇది శరీర బరువు, హైపర్ టెన్షన్ సమస్యను తగ్గిస్తుంది. దీంట్లోని పొటాషియం, సోడియం, మినరల్స్, విటమిన్లు, ఖనిజాలు అధిక రక్తపోటును తగ్గుముఖం పట్టిస్తాయి. అలాగే సహజమైన హైడ్రేటింగ్, శీతలీకరణ లక్షణాలు కలిగి ఉండే సొరకాయ మిమ్మల్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఎలా చూసిన సొరకాయ దోశ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే మీ డైట్ ప్లాన్లో దీన్ని భాగంగా చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.