Best Ways to Stimulate the Brain Health :మన బాడీలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేయాలంటే మెదడు ఆరోగ్యంగా ఉండాలి. అది హెల్తీగా ఉంటేనే.. మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే భావోద్వేగాల్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఆలోచించగలం. కానీ, ప్రస్తుత కాలంలో అనేక కారణాల వల్ల వయసుతో సంబంధం లేకుండా మతిమరపు, ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బ్రెయిన్ ప్రశాంతంగా ఉండేదుకు.. తద్వారా పవర్ పెరిగేందుకు పలు సూచనలు చేస్తున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రెగ్యులర్ వ్యాయామం:డైలీ వ్యాయామం అనేది శరీరానికి మాత్రమే కాదు.. మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. జార్జియా విశ్వవిద్యాలయం పరిశోధకులు.. సాధారణ శారీరక శ్రమ అనేది మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుందని కనుగొన్నారు. అలాగే మానసిక రుగ్మతలను నిరోధించడంలోనూ చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి.. మీ రోజువారి జీవితంలో కాస్త శారీరక శ్రమ ఉండేలా చురుకైన నడక, ఈత లేదా యోగా లాంటివి చేర్చుకున్నారంటే మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. తద్వారా మెరుగైన ఆలోచనలు, సత్వర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం: మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. డైలీ పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సరైన పోషకాహారం మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదే మనం సరైన ఫుడ్ తీసుకోకపోతే ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే సైటోకైన్స్ ఎక్కువగా విడుదలై మెదడును దెబ్బతీస్తాయట. ఇది ఎక్కువకాలం కొనసాగితే మతిమరుపు, ఆల్జీమర్స్ లాంటి సమస్యలు రావొచ్చు. అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో కూడా పండ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ఆహారం మెదడు రుగ్మతల నుంచి కాపాడుతుందని తేలింది. వీటితోపాటు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం.