Best Tips to Control Thyroid: థైరాయిడ్.. ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. నేటి కాలంలో జీవనశైలి మార్పులు, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి.. వంటి వివిధ కారణాల వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తుతోంది. శరీరంలో జీవక్రియలను నియంత్రించే హార్మోన్లను విడుదల చేసే థైరాయిడ్ గ్రంథి.. సరిగ్గా పనిచేయకపోవడం వల్ల హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజానికి దారి తీస్తుంది.
ఫలితంగా.. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి జుట్టు రాలడం, ఇరెగ్యులర్ పీరియడ్స్, గర్భం దాల్చకపోవడం, బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. దీని విషయంలో వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఐదు అద్భుతమైన చిట్కాలు సూచిస్తున్నారు. అవి పాటించారంటే థైరాయిడ్ అదుపులోకి రావడం గ్యారెంటీ అంటున్నారు! ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చురుగ్గా నడవడం: నేటి రోజుల్లో అనేక వ్యాధులు రావడానికి శారీరక శ్రమ లేకపోవడమే కారణం. అందులో థైరాయిడ్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు చురుగ్గా నడవడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా మీ జీవక్రియ రేటు పెరగడంతోపాటు మానసిక స్థితి మెరుగుపడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే కండరాలను బలోపేతం చేయడానికి వారానికి 2-3 సార్లు కొన్ని వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి మెరుగుపడుతుంది.
అయోడైజ్డ్ ఉప్పు: మానవ శరీరంలో థైరాయిడ్ పనులను ప్రోత్సహించడంలో అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణకు అవసరయ్యే అయోడైజ్డ్ సాల్ట్ మీ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఎక్కువ మోతాదులో తీసుకోకుండా మితంగా వాడాలి. అదేవిధంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇవి కూడా థైరాయిడ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు.