Best Sleeping Position for Good Health : మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర చాలా అవసరం. అందుకోసం.. ప్రతిరోజు రాత్రి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే, పడుకునేటప్పుడు ఒక్కొక్కరికీ ఒక్కో పొజిషన్లో నిద్రించే(Sleep)అలవాటు ఉంటుంది. కొందరికి బోర్లా .. ఇంకొందరికి వెల్లకిలా.. మరికొందరికి కుడి వైపు, ఎడమ వైపు తిరిగి నిద్రించే అలవాటు ఉంటుంది. కానీ, ఏ వయసు వారైనా అన్ని పొజిషన్ల కంటే 'ఎడమ వైపు' తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది : లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. మనం తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు.. మొదట శరీరంలోని కుడివైపు ఉన్న పెద్ద పేగు ఎంట్రీ పార్ట్ సెకమ్‌లోకి ప్రవేశించి క్రమంగా ఎడమవైపు ఉన్న పెద్ద పేగు ఎగ్జిట్ పార్ట్ పురీషనాళంలోకి వెళ్తాయి. అయితే, మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల.. గురుత్వాకర్షణ కారణంగా అవి కుడి నుంచి ఎడమకు ఈజీగా కిందికి వెళ్లిపోతాయి. ఫలితంగా మలవిసర్జన సాఫీగా సాగుతుందని, గట్ సిస్టమ్ హెల్త్ మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. అందుకే.. నైట్ పడుకునేటప్పుడైనా, కాస్త రెస్ట్ తీసుకునేటప్పుడైనా.. ఎడమ సైడ్‌కి తిరిగి పడుకోవడమే మేలు అంటున్నారు.
2009లో 'Neurogastroenterology and Motility'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఎడమ వైపు తిరిగి పడుకున్న వ్యక్తులు కుడి వైపు తిరిగి పడుకున్న వ్యక్తుల కంటే వేగవంతమైన జీర్ణక్రియ రేటును కలిగి ఉన్నారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జపాన్‌లోని టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్సిటికీ చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. మసాయుకి ఓకుబో(Masayuki Okubo) పాల్గొన్నారు. రోజూ ఎడమ వైపు తిరిగి నిద్రించడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
గుండె ఆరోగ్యానికీ మేలు : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో మనం నిద్రించే పొజిషన్ కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ తిరిగి నిద్రపోవడం హార్ట్ హెల్త్‌కు మంచిదంటున్నారు. ఎందుకంటే.. మన బాడీలో గుండె లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక మనం అదే పొజిషన్లో నిద్రించినప్పుడు గురుత్వాకర్షణ కారణంగా రక్తం ఈజీగా గుండెకు సరఫరా అవుతుందట. ఫలితంగా గుండెపై కాస్త ఒత్తిడి కాస్త తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
వయసును బట్టి నిద్ర - మీరు ఎన్ని గంటలు పడుకోవాలో తెలుసా?
లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది : మన బాడీలో కాలేయం కుడి వైపు ఉంటుంది. కాబట్టి మీరు రైట్ సైట్ తిరిగి పడుకుంటే లివర్‌పై భారం పడి వ్యర్థాలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అదే మీరు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గడమే కాకుండా వ్యర్థాలను ఈజీగా బయటకు పంపుతుంది. ఫలితంగా లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు.