Best Foods to Eat Healthy Liver :కాలేయం.. మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. శరీరంలోని రెండో అతి పెద్ద అవయవం కూడా ఇదే. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కాలేయం. రక్తం నుంచి విషపదార్థాలను తొలగించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే లివర్.. బైల్ అనే ఫిజియోలాజికల్ ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది షుగర్ స్ధాయిలను నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆరోగ్యకరమైన రక్తాన్ని శరీరానికి అందించడంలో కాలేయానిదే(Liver)కీలక పాత్రగా చెప్పుకోవచ్చు.
అయితే, ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి.. కారణంగా చాలా మంది లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు, కాలేయ సమస్యల వల్ల మధుమేహంతో పాటు అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే.. కాలేయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి, దాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అందుకోసం కొన్ని బెస్ట్ ఫుడ్స్ సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పసుపు : పసుపులో కర్కుమిన్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఫైబ్రోసిస్, నాన్-ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, సిర్రోసిస్ నుంచి కాలేయాన్ని రక్షిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే, కాలేయాన్ని శుభ్రపర్చడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.
వెల్లుల్లి : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారపదార్థాలలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు కాలేయాన్ని దెబ్బతినకుండా రక్షించడంలో, కొన్ని కాలేయ వ్యాధుల చికిత్సలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.
తృణధాన్యాలు : వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ బి, ఫాస్పరస్, మాంగనీస్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవేకాకుండా తృణధాన్యాలలో ఉండే మరికొన్ని పోషకాలు రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించి కాలేయానికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలలో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నారు.