Air Pollution Impact Diabetes : కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు పాడై క్యాన్సర్, గుండెపోటు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామని మనకు తెలుసు. అయితే కలుషితమైన గాలి పీల్చుకోవడం వల్ల మధుమేహ ప్రమాదం కూడా పెరుగుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాలుష్యం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉందని వెల్లడించాయి. యూఎస్, యూరప్, చైనా దేశాల్లో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం సాధారణ వాతావరణంలో ఉండే వారికన్నా కాలుష్యంలో ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు 10g/m3 ఎక్కువగా కనిపిస్తున్నాయట. తాజాగా జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా అనే మెడికల్ జర్నల్ 'Air Pollution: A New Cause of Type 2 Diabetes?' పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది.
ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వీ మోహన్ దీన్ని రచించారు. దీని ప్రకారం కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల ఇన్సులిన్ స్రావాన్ని ప్రభావితం చేసే, ఇన్సులిన్ రెసిస్టెంట్కు దారితీసే ఎండోక్రైన్ డిస్ రప్టర్ ఎదుగుతుంది. దీని కారణంగా బీటా కణాల ఫంక్షనింగ్ తగ్గించే ప్యాంక్రీస్కు కారణమవుతుంది. లివర్, కండరాలు, కణాల్లో ఇన్సులిన్ స్థాయిల హెచ్చు తగ్గులకు దారితీస్తుంది. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఇన్ఫ్లమేషన్కు దారితీసే ఆక్సిడేటివ్ ఒత్తిడిని పెంచుతుంది. ఇది డయాబెటిస్ కారకంగా పనిచేస్తుంది. ఈ స్టడీ కోసం దిల్లీ, చెన్నై నగరాల్లో ఉంటున్న 12,064 మంది రక్త నమూనాలను సేకరించారట. దీంట్లో వారు గుర్తించిన విషయం ఏంటంటే సాధారణ వాయువు పీల్చేవారితో పోలిస్తే కాలుష్యమైన గాలిలో జీవించే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం 22శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.