కొత్త అందాల్ని స్వాగతించడంలో ఎప్పుడూ ముందుంటుంది టాలీవుడ్. అందుకే ప్రతి ఏడాది నార్త్ లేదా కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్ నుంచి కొత్త సోయగాలు తెలుగు తెరలపై వచ్చి సందడి చేస్తుంటాయి. అలా త్వరలోనే తెలుగులో పరిచయం కానున్న కొత్త నాయికలు ఎవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం.
నందమూరి వారసుల కోసం కొత్త తారలు! - ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుంచి ఇద్దరు వారసులు సినీ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. వారిలో ఒకరు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో(Prasanth varma mokshagna movie) సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి సెప్టెంబరు మొదటి వారంలో అనౌన్స్మెంట్ రానుందట. ఇందులో మోక్షజ్ఞ సరసన ఓ కొత్త భామ కనిపించనుందని సమాచారం.
అలానే నందమూరి ఫ్యామిలీ నుంచి రానున్న మరో హీరో జానకీ రామ్ తనయుడు నందమూరి తారక రామారావు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. యలమంచిలి గీత నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో తెలుగమ్మాయి వీణ రావును హీరోయిన్గా పరిచయం కానుంది.
ప్రభాస్ కల్కి 2898 ఏడీతో దీపికా పదుకొణె తెలుగు తెరకు పరిచయం కాగా, రాజాసాబ్‌తో కోలీవుడ్ భామ మాళవిక మోహనన్‌ను తెలుగులోకి ఎంట్రీ కానుంది. ఇక హను రాఘవపూడి - ప్రభాస్ సినిమాతో అయితే కొత్త సోయగం పరిచయం కానుంది. ఆమె పేరు ఇమాన్వి(Imanvi prabhas). డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న ఈ దిల్లీ సోయగం ఇప్పుడు హను రాఘవపూడి చిత్రంతో పరిచయం కానుంది.