Patriotic Movies In Indian History : దాదాపు 200 సంవత్సరాల పరాయి పాలనకు చరమగీతం పాడేదాకా సాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కళలు, కళాకారుల పాత్ర కీలకం. ఈ ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న దశలోనే భారతీయ సినిమా మాటలు నేర్చింది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య ఉద్యమం, సమరయోధుల స్ఫూర్తితో తెలుగులో తెరకెక్కిన తెలుగు సినిమాలపై లుక్కేద్దాం పదండి.
అగ్గిపిడుగు అల్లూరి
స్వాతంత్ర్యం కావాలని ఆంగ్ల దొరలపై నిప్పుల చెరిగిన తెలుగు వీరుడు 'అల్లూరి సీతారామరాజు'. ఈ సినిమాలో సూపర్ కృష్ణ సీతారామరాజు పాత్రను పోషించారు. ఈ మూవీ అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఇందులో కృష్ణ అల్లూరి పాత్రలో పరాకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. 'ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు', మిస్టర్ రూథర్ ఫర్డ్ లాంటి కృష్ణ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. వారికి గూస్ బంప్స్ తెప్పించాయి.
రేనాటి వీరుడు సైరా నరసింహారెడ్డి
స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ తిరుగుబాటునే కథాంశంగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. భారతీయుల గుండెలను ఉప్పొంగేలా చేసిన ఆ ఉద్యమగాథను సజీవంగా తెలుగు ప్రేక్షకులకు అందించారు మెగాస్టార్ చిరంజీవి. 'రేనాడు వీరులారా- చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి' అంటూ చిరంజీవి వెండితెరపై చేసిన గర్జనకు బాక్సాఫీస్ బద్దలైంది. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
ఇద్దరు పోరాట యోధుల 'ఆర్‌ఆర్‌ఆర్'
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఏకంగా ఇద్దరు పోరాట యోధులను 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం కోసం కీలక పాత్రలుగా ఎంచుకున్నారు. ఆంగ్లేయుల తూటాలకు ఎదురెళ్లిన అల్లూరితో, నిజాంపై పోరు జరిపిన గోండు వీరుడు కొమరం భీమ్ స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపోయారు. పవర్ఫుల్ డైలాగ్‌లతో ప్రేక్షకులను కట్టిపడేశారు. దీంతో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిసింది.