Nayanthara Dhanush Controversy : నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ రిలీజ్ విషయంలో హీరోయిన్ నయనతార, హీరో ధనుశ్ మధ్య జరిగిన వివాదం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ధనుశ్ తీరును తప్పుబడుతూ నయన్ ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేసింది. అయితే తాజాగా దీనిపై నయనతార స్పందించింది. ఆమె అలా ఓపెన్ లెటర్ రాయడానికి గల కారణాన్ని తెలిపింది. అసలు డాక్యుమెంటరీ విషయంలో ఏం జరిగిందో చెప్పింది.
'ధనుశ్ గురించి లెటర్ రిలీజ్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది?' అని ఓ విలేకరి ప్రశ్నించాడు. "న్యాయమని నమ్మాను. అందుకే దానిని బయటపెట్టాను. అయినా నేనెందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి కానీ. పబ్లిసిటీ కోసం అవతలి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయను. నా డాక్యుమెంటరీ పబ్లిసిటీ కోసం ఇలా చేశానని చాలా మంది అంటున్నారు. అందులో వాస్తవం లేదు. వీడియో క్లిప్స్ కోసం ఎన్‌వోసీ కావాలని ధనుశ్‌ను సంప్రదించడానికి ట్రై చేశాను. విఘ్నేశ్, నేను, మా కామన్ ఫ్రెండ్స్ కూడా కాల్స్ చేశాడు. అయినా మాకు ఎన్‌వోసీ ఇవ్వలేదు. సినిమాలో ఉన్న నాలుగు లైన్ల డైలాగ్‌ను మా డాక్యుమెంటరీలో ఉపయోగించాలనుకున్నాం. ఎందుకంటే ఆ సంభాషణలు మా లైఫ్‌లో ఎంతో ముఖ్యమైనవి అని అనుకున్నాం. ఈ విషయంపై ఆయన మేనేజర్‌ను కూడా సంప్రదించాను.
మరి ధనుశ్కు నాపై కోపం ఎందుకు వచ్చిందో? ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో? పక్కవాళ్లు చెప్పిన మాటలు విని అలా చేస్తున్నారా? అని తెలుసుకోవడానికి ఆయనతో మాట్లాడాలనుకున్నాను. కానీ అది జరగలేదు. అయినా ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు. ఆయన నాకు మంచి మిత్రుడే. కాకపోతే ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో నాకు తెలీదు." అని నయన్ తెలిపారు.