Suriya Comments on Tollywood Heroes : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన కొత్త చిత్రం 'కంగువా' ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్నారు. తన సినిమాను పాన్ ఇండియా ఆడియెన్స్‌కు రీచ్ అవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కంగువా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సూర్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు సోదరుడితో సమానమని చెప్పారు. "ఆయనతో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. నా సినిమాలు చూసి ఫోన్ చేసి ప్రశంసిస్తారు. వాళ్ల కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది." అని అన్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తనకు స్కూల్లో జూనియర్ అని, మహేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని, ఎమోషన్స్ బాగా చూపిస్తారని ప్రశంసించారు సూర్య.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు స్పష్టంగా మాట్లాడడం తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. "తారక్ తెలుగు మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఆ విషయం నన్నెంతో ఆకట్టుకుంటుంది." అని చెప్పుకొచ్చారు.