Harihara veeramallu Teaser : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి మేకర్స్ తాజాగా టీజర్ విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అయితే, ఈ టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ మూవీకి సంబంధించిన మిగిలిన షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను డైరెక్టర్ జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు.
ఇటీవల విడుదలైన కొన్ని పోస్టర్లపై కూడా క్రిష్ జాగర్లమూడి పేరు లేకపోవడం వల్ల కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ సినిమా నుంచి క్రిష్ వైదొలిగారా అన్న కామెంట్స్ కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా అప్డేట్తో మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.
"నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ లాంటి సినిమాలకు రచయితగా, అలాగే డైరెక్టర్‌గా పనిచేశారు జ్యోతి కృష్ణ. ఇప్పుడు ఆయన ఈ హరిహర వీరమల్లు మిగతా షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. అందుకే సినిమా పూర్తి చేయడంలో ఊహించని ఆలస్యం కారణమైంది. దీంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం" అని తెలిపారు.