Prithviraj Sukumar Luxury Life Net Worth : సలార్‌లో ప్రభాస్ ఫ్రెండ్‌గా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కేవలం నటుడే కాదు మలయాళంలో స్టార్ డైరక్టర్ ప్రొడ్యూసర్ కూడా. అక్టోబరు 16న పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయన నేడు 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. గత 22 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న ఆయన ఇప్పటికే మళయాలం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ పాత్ర వరద రాజమన్నార్‌గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులలోనూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అనిపించుకున్న ఆయన 'ఆడు జీవితం, ద గోట్ లైఫ్' సినిమాతో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించారు. కథకు తగ్గట్లుగా స్క్రీన్‌పైన పాత్రలో ఒదిగిపోతూ మంచి పెర్‌ఫార్మెన్స్ కనబరిచే ఆయన లైఫ్ స్టైల్, నెట్ వర్త్, పర్సనల్ లైఫ్ స్టైల్ వంటి విషయాలను తెలుసుకుందాం.
సినిమాల్లోకి అలా - పృథ్వీరాజ్‌ది సినీ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ. తండ్రి పరమేశ్వరన్ సుకుమారన్, తల్లి మల్లిక, అన్నయ్య ఇంద్రజిత్, వదిన పూర్ణిమ అందరూ నటులే. అయితే పృథ్వీ చిత్ర పరిశ్రమలో కాకుండా మరో రంగంలో స్థిరపడాలనుకున్నారు. ఉన్నత చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. అయితే అక్కడ ఉన్నప్పుడు దర్శకుడు రంజిత్ నుంచి ఓ సినిమాకి సంబంధించి ఆడిషన్‌కు పిలిపించి హీరోగా సెలెక్ట్ చేశారు. అలా తొలిసారి నందనం సినిమాలో కనిపించిన ఆయన ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించారు.
ప్రేమ పెళ్లి - సుకుమారన్ భార్య పేరు సుప్రియా మేనన్. ఈమె గతంలో జర్నలిస్టు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. తన భార్య వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెబుతుంటారు పృథ్వీ. వీరికో పాప. పేరు అలంకృతా మేనన్ సుకుమారన్.
ఓ ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సుమారుగా రూ.54కోట్ల వరకూ ఆస్తులున్నట్లు సమాచారం. భారీ పారితోషికం అందుకునే అతికొద్ది మంది మళయాలీ నటుల్లో ఒకరైన సుకుమారన్ ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తారట. సలార్‌లో ప్రభాస్ స్నేహితుడి పాత్ర కోసం సుకుమారన్ రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.