India's First 100 Crore Movie:సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో? ఎవరు అమాంతం సూపర్ స్టార్స్‌గా మారిపోతారో? ఎవ్వరూ ఊహించలేరు. 1976లో 'మృగాయా' అనే చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు మిథున్ చక్రవర్తి. ఆ సినిమాకు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అయితే బాలీవుడ్ పరిశ్రమలో టాలెంట్‌తో పాటు అందం కూడా ముఖ్యమే. నేషనల్ అవార్డు వచ్చినా సరే సన్నగా, పెద్దగా రంగు లేని తనకు అవకాశాలు రాలేదని ఆయన ఇటీవల పాల్గొన్న సరిగమప షోలో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
'ఏ టాప్ హీరోయిన్ నాతో పని చేయడానికి ఇష్టపడలేదు. నేను ఒక చిన్న హీరో అనే ఉద్దేశంలో వాళ్లు ఉండేవారు. ఇండస్ట్రీలో చాలామంది నేనెప్పుడూ హీరోని కాలేనని, నన్ను హీరోగా తీసుకోరు అని కామెంట్ చేసేవారు. నేను ఇప్పుడు మీతో చెప్పలేని మాటలు నన్ను అన్నారు. నేను చాలా బాధపడ్డాను. సినిమాలు అనౌన్స్ చేశాక కూడా హీరోయిన్స్ నా మూవీ నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. నా తోటి నటులకు కూడా నేను ఎక్కడ స్టార్ అవుతానో అనే భయం ఉండేది. బాలీవుడ్లో తెలుపు రంగు మీద ఉన్న ఇష్టం వల్ల రంగు తక్కువగా ఉన్నానని నన్ను చాలా సినిమాల్లోకి తీసుకోలేదు. అయితే ఆ సమయంలోనే 'టాక్దీర్' అనే మూవీలో నాకు హీరోయిన్గా జీనత్ అమన్ నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం నన్ను ఏ గ్రేడ్ యాక్టర్‌ని చేసింది. ఆ విషయంలో నేను జీనత్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను' అంటూ మిధున్ చక్రవర్తి చెప్పుకొచ్చారు.