Aa Okkati Adakku Movie Telugu Review :టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు'. ఫుల్ ఆన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ( మే 3)న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే ?
స్టోరీ ఏంటంటే ?
గణ (అల్లరి నరేష్) అలియాస్ గణపతి ఓ గవర్నమెంట్ ఉద్యోగి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అతడు పని చేస్తుంటాడు. ఎంతోమందికి వివాహాలు జరిపించిన అతడికి మాత్రం 30 ఏళ్లు దాటినా పెళ్లి కాదు. తన కంటే ముందు తమ్ముడు (రవికృష్ణ)కు కూడా మేనమామ కూతురు (జెమీ లివర్)ను ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఇదిలా ఉండగా, ఇంట్లో వాళ్లంతా కూడా గణ కోసం ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తారు. కానీ, అతడి వయసు ఎక్కువనో, లేకుంటే తమ్ముడుకి ముందు పెళ్లి అయిందనో ఇలా రకరకాల కారణాలు చెప్పి నిరాకరిస్తుంటారు. దీంతో చేసేదేమీ లేక హ్యాపీ మ్యాట్రిమోనీలో ప్లాటినం మెంబర్‌గా చేరతాడు.
ఆ తర్వాత దాని ద్వారా పరిచయమైన సిద్ధి (ఫరియా అబ్దుల్లా)పై గణ మనసు పారేసుకుంటాడు. అయితే ఆమె గణ పెళ్లి ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే జబ్బు పడిన తన తల్లిని సంతోష పెట్టేందుకు ఓసారి సిద్ధిని తన ప్రియురాలిగా ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తాడు హీరో. కట్ చేస్తే.. ఆ మరుసటి రోజే సిద్ధి గురించి ఓ వార్త బయటకొస్తుంది. హ్యాపీ మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే వ్యక్తి అంటూ ఆమె వార్తల్లోకి ఎక్కుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు ఈ సిద్ధి ఎవరు? ఆ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లి కాని కుర్రాళ్లను ఎలా మోసం చేస్తోంది? ఇలాంటి విషయాలే మిగతా స్టోరీ.
ఎలా సాగిందంటే :
పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యూత్ సదురు మ్యాట్రిమోనీ సంస్థలను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు? ఆ వివాహ వేదికల ద్వారా వాళ్లకు ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయి? ఆయా సంస్థలు యూత్ ఎమోషన్స్‌తో ఎలా ఆడుకుంటున్నాయన్నదే ఈ స్టోరీలో కీలక అంశాలు. వాస్తవానికి ఇది చాలా సీరియస్ విషయం. కానీ ఇదే ఆ అంశాన్ని ఈ సినిమాలో ఎంతో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నాన్ని చేశారు డైరెక్టర్ మల్లి అంకం. అయితే ఈ సీరియస్ కథకు డైరెక్టర్ వేసిన షుగర్ కోటింగ్ చాలా తక్కువ అని అనిపించింది. అందుకే ఈ కథ అటు సీరియస్‌గా సాగక, ఇటు కామెడీగా నడవక రెండిటికీ మధ్యలో మిగిలిపోయింది.
పెళ్లి కాని కుర్రాడిగా తన ఆవేశాన్ని చూపెడుతూ ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో హీరో పాత్రను పరిచయం చేసిన తీరు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. గణ కుటుంబ నేపథ్యం, వాళ్ల బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్ చేసే హంగామా, ఈ క్రమంలో వచ్చే గణ పెళ్లి చూపుల ఎపిసోడ్, ఇలా సినిమాలో పలు సన్నివేశాలు సరదాగా సాగిపోతుంటాయి.
ఇక సిద్ధి పాత్ర ఎంట్రీ ఇచ్చాక మూవీ కాస్త రొమాంటిక్‌గా మారుతుంది. ఆ తర్వాత హ్యాపీ మ్యాట్రిమోనీలో మెంబర్‌గా చేరిన గణకు ఈ క్రమంలో ఎదురయ్యే అనుభవాలు ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు ఆలోచింపజేయిస్తాయి. ఆ తర్వాత నుంచి కథ కామెడీ కంటే సీరియస్ మోడ్‌లోనే సాగిపోతుంది. ఇంటర్వెల్‌కి ముందు సిద్ధిలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారు డైరెక్టర్. దాన్ని చూశాక గణ కూడా ఆమె చేతిలో మోసపోనున్నాడా? అన్న ఆసక్తి అందరిలోనూ మొదలవుతుంది.
సెకెండాఫ్‌లో ఓ వైపు గణ లవ్ స్టోరీనీ చూపిస్తూనే, మరోవైపు మ్యాట్రిమోనీ సైట్ల మాటున జరుగుతున్న మోసాల్ని బలంగా ఎత్తిచూపే ప్రయత్నాన్ని చేశారు డైరెక్టర్. దీంతో ఈ స్టోరీ పూర్తిగా సీరియస్‌గా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు తెలిసిన వ్యవహారమే అయినా ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అలాగే దీని చుట్టూ నడిపిన కామెడీ ట్రాక్ కూడా అక్కడక్కడా నవ్వులు పూయించింది. కెరీర్ పరంగా గణ మంచిగా స్థిరపడినప్పటికీ, తనకు పెళ్లి కాకపోవడానికి గల కారణం అంత సమర్థవంతంగా అనిపించదు. సినిమాని ముగించిన తీరు కాస్త ఫర్వాలేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే :
గణపతి వంటి ఫ్రస్టేషన్ పాత్రలను అల్లరి నరేశ్ ఎప్పటి నుంచో చేస్తునే వస్తున్నారు. అందుకే ఈ రోల్‌ను ఆయన తనదైన శైలిలో తేలికగా చేసుకుంటూ వెళ్లిపోయారు. కానీ ఆయనలోని కామెడీ యాంగిల్‌ను డైరెక్టర్ పూర్తిగా ఉపయోగించుకోవడంలో విఫలమైపోయారని అనిపిస్తోంది. సిద్ధి పాత్రలో ఫరియా అందంగా కనిపించింది. కథలో ఆమెది మంచి ప్రాధాన్యమున్న పాత్రగానే మలిచారు. ఆరంభంలో చలాకీ నటనతో ఆకట్టుకున్న ఫరియా, సెకెండాఫ్‌లో తనలోని ఎమోషనల్ కోణాన్ని చూపించి కట్టిపడేస్తుంది. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా నటి జెమీ లివర్ పాత్ర ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.
సినిమాలో తాను కనిపించినప్పుడల్లా థియేటర్లో నవ్వులు వినిపిస్తాయి. వెన్నెల కిషోర్, హర్ష పాత్రలు కూడా తెరపై కనిపించినంత సేపూ నవ్వించాయి. ఇక మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు నటించాయి. డైరెక్టర్ ఎంచుకున్న కథలో కొత్తదనమున్నప్పటికీ, దాన్ని ఆద్యంతం వినోదభరితంగా తీర్చిదిద్దే విషయంలో ఆయన తడబడ్డారు. అందు వల్ల కథలో బలమైన సంఘర్షణ కనిపించదు. ప్రతి సీన్ ఊహలకు తగ్గట్లుగానే సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు డ్రామా కూడా మరీ సినిమాటిక్‌గా ఉంది. గోపీసుందర్ పాటలు, నేపథ్య సంగీతం ఓకే అన్నట్లుగా ఉన్నాయి. సినిమాలోని విజువల్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.