Samantha Father Passed Away :నటి సమంత ఇంట్లో తీవ్ర నిషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం మరణించారు. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు నటి సమంత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 'నాన్నా మళ్లీ మనం కలిసేంత వరకూ' అంటూ హార్ట్ బ్రేక్ అయ్యిన ఎమోజీని షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు సమంత కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.
జోసెఫ్ ప్రభు ఆంగ్లో ఇండియన్. ఆమె జీవితంలో తన తండ్రిది ముఖ్య పాత్ర అని సమంత ఇదివరకు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆమె కెరీర్లో తన తండ్రి జోసెఫ్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారని సమంత గతంలో పేర్కొన్నారు. సినీ కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమంత తన తల్లిదండ్రులను తరచూ కలిసేవారు. వాళ్లతో గడిపిన సందర్భాలను సోషల్ మీడియాలోనూ షేర్ చేసేవారు.
'చిన్నతనంలో నేను గుర్తింపు కోసం ఎక్కువగా పోరాటం చేస్తుండేదాన్ని. నాకు ఏమీ తెలియని అమాయకురాలినని నా తండ్రి భావించేవారు. నన్ను ఒక చిన్నపిల్లలా చూసేవారు. మా నాన్న ఒక్కరే కాదు. భారత్లో ఉన్న తల్లిదండ్రులందరూ తమ పిల్లలను అలాగే చూస్తారు. ఆయన మాటలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి. తొలి సినిమా అవకాశం వచ్చినప్పుడు నేను చేయలేననుకున్నా. సినిమా రీలీజ్ అయ్యాక వచ్చిన ప్రశంసలను కూడా అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. కాన్ఫిడెన్స్ పెంచుకున్నాను. నటిగా రాణించిన తర్వాత నా తల్లిదండ్రులు నన్ను చూసి ఎంతో గర్వపడ్డారు. నా పని విషయంలో వాళ్లు సంతృప్తి చెందారు' అని సమంత తన తండ్రి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.