Cyber Security Course including in Degree and BTech :నిమిషాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తూ, కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తున్న సైబర్ నేరస్థుల ఆగడాలను నియంత్రించేందుకు విశ్వవిద్యాలయాలు సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. వీటిని నియంత్రించేందుకు అవసరమైన నిపుణుల కొరతను అధికమించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ కోర్సును, జేఎన్‌టీయూ హైదరాబాద్ సైబర్ భద్రతపై ఇంజినీరింగ్‌లో నాలుగు సెమిస్టర్లలో బోధిస్తున్నాయి.
వచ్చే సంవత్సరం డిగ్రీలోనూ :ఒకటి, రెండేళ్లలో ఏకంగా 200శాతం సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉండటంతో ఇంజినీరింగ్ కోర్సులో సైబర్ భద్రత అంశాల్లో సిలబస్‌ను సమూలంగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో ఇంజినీరింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సు ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీల్లో సైబర్ భద్రతపై పాఠ్యాంశాలను బోధించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు, విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పది శాతానికి తక్కువగా నిపుణులు :విశ్వవ్యాప్తంగా ఐటీ సంస్థలు, పరిశ్రమలు, మార్కెట్ అవసరాలకు సైబర్ భద్రత అనివార్యం. నగదు లావాదేవీలు, సామాజిక మాధ్యమాల ఖాతాలకు రక్షణ లేక సైబర్ నేరస్థులు ఏటా రూ.వేల కోట్లను దోచుకుంటున్నారు. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఈ-మెయిళ్లతో మాల్‌వేర్ ప్రవేశపెట్టి పరిశ్రమలు, కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ రంగసంస్థలను బెదిరిస్తున్నారు. బ్యాంకుల సర్వర్లలోకి ప్రవేశించి రూ.కోట్లు దోచుకుంటున్నారు. సైబర్ నిపుణులుంటే ఈ నష్టాలను అరికట్టే అవకాశాలుంటాయి. ఓ సంస్థ సర్వే నిర్వహించగా దేశంలో 40లక్షల మంది నిపుణులకు గాను 3 లక్షలమందే ఉన్నట్లు గుర్తించింది. ఇంజినీరింగ్, ఎంటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ డిగ్రీ, సమాచార నైపుణ్యాలుంటే వేలమందికి ఉద్యోగాలు లభించనున్నాయి.