Behavior Modifications in Parents : పిల్లలకు ఇది వార్షిక పరీక్షల సమయం. వారి భవిష్యత్తుకు ఇది చాలా కీలకమైంది. ముఖ్యంగా ఇంటర్, పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే పిల్లలపై పరీక్షల వేళ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల దైనందిన జీవితంలో మార్గదర్శకులుగా మారడమనేది అత్యంత అవసరం. వారి చదువుకు అనుకూలమైన వాతావరణం కల్పించడం ముఖ్యమైన బాధ్యత. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ఇంటర్, ఆ తరువాత వచ్చే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సమాయత్తం చేసేందుకు తల్లిదండ్రులు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే.
"ముందుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు బరువు ఎక్కువగా ఉండి, తరచూ జంక్‌ఫుడ్ లాగిస్తూ మీ పిల్లలను క్రమశిక్షణతో ఉండండి, కష్టపడండి అని హితబోధ చేస్తే ఎలా వింటారు? మీరు బద్ధకంగా ఉంటే పిల్లలు కూడా మీరు చెప్పేది లెక్క చేయరు. వారు అనుసరించేది మీ చర్యలనే అని గుర్తుంచుకోవాలి" -ఒలివర్ అన్వర్, ఫిట్‌నెస్ కోచ్
ఆరోగ్యంపై శ్రద్ధ : నూనె పదార్థాలు, జంక్‌ఫుడ్, మసాలా ఆహారం తినకుండా చూడాలి. ఇంట్లోనే మంచి పోషకాలు ఉండే ఆహారం సమకూర్చాలి. పెద్దలు వీటిని ఆహారంలో తీసుకుంటే సాధారణంగా పిల్లలు కూడా వాటిని తీసుకుంటారు.
మొబైల్ ఫోన్ వాడకం :పిల్లలు చదువుకునే సమయంలో పెద్దలు ఫోన్ చూస్తూ లేదా మాట్లాడుతూ కాలక్షేపం చేయడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో వారి ఏకాగ్రత సెల్‌ఫోన్‌పైకి మళ్లే అవకాశం ఉంటుంది. అవసరమైతేనే పిల్లల ముందు మొబైల్ ఫోన్ ఉపయోగించాలి.
ఒత్తిడికి దూరం :ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం తప్పుగా రాయొద్దు, చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నావ్ అని పిల్లలను ఇబ్బంది పెట్టకూడదు. ఇది పిల్లలను మరింత ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. ఒక్కోసారి తల్లిదండ్రులు వారి పని ఒత్తిడిని ఇంట్లో చూపిస్తుంటారు. ఇది పిల్లల చదువుపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది.