LinkedIn AI Tools :నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం వాళ్లు పడే యాతన అంతాఇంతా కాదు. అందుకే నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను నివారించడానికి, ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ యాప్ లింక్డిన్ (LinkedIn) సరికొత్త ఏఐ టూల్స్‌ను తీసుకువచ్చింది. వీటిని ఉపయోగించి, నిరుద్యోగులు చాలా సులువుగా, తమకు సంబంధించిన రంగాల్లోని ఉద్యోగాలను వెతుక్కోవడానికి వీలవుతుంది.
నిరుద్యోగులు ఇప్పటి వరకు లింక్డిన్‌లో తమకు కావాల్సిన జాబ్ పోస్టింగ్స్‌ను వెతకడం కోసం వివిధ రకాల ఫిల్టర్స్‌ను ఉపయోగిస్తూ వస్తున్నారు. కానీ ఇకపై ఆ అవసరం లేకుండా ఏఐ టూల్స్ (AI Tools) ఆ పనిని మరింత సులభతరం చేయనున్నాయి. అయితే ఈ కొత్త ఫీచర్లు అందరు యూజర్లకు అందుబాటులో ఉండవు. కేవలం ప్రీమియం సబ్‌స్క్రైబర్లు మాత్రమే వీటిని వినియోగించుకోగలరు.
నయా ఏఐ టూల్స్ ఇవే!
- జాబ్ సీకర్ కోచ్ : ఈ ఏఐ అసిస్టెంట్ వర్చువల్ రిక్రూటర్ తరహాలో పనిచేస్తుంది. మీరు సింపుల్‌గా ఎలాంటి ఉద్యోగం కావాలో టైప్ చేస్తే చాలు, మీకు కావాల్సిన సమాచారం ఇస్తుంది. ఉదాహరణకు "రూ.10 లక్షల వార్షిక వేతనం ఇచ్చే డేటా అనలిస్ట్ ఉద్యోగాన్ని వెతికి పెట్టు" అని మీరు ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే చాలు. డేటాబేస్‌లో దానికి సంబంధించిన సమాచారం మొత్తం మీ ముందు ఉంటుంది. అంతేకాదు, మీరు సదరు పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే, మీ ప్రొఫైల్ ముందు వరుసలో ఉండేలా, ఎలాంటి మార్పులు చేయాలో కూడా తెలియజేస్తుంది.
- రెజ్యూమ్ అండ్ అప్లికేషన్ రివ్యూ టూల్ : ఈ ఏఐ టూల్‌లో మీ రెజ్యూమ్, అప్లికేషన్‌లను అప్‌లోడ్ చేయాలి. అప్పుడు వాటిని ఏఐ టూల్ క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. తరువాత తగు మార్పులు, చేర్పులు సూచిస్తుంది. జాబ్‌కు సెలెక్ట్ అయ్యేలా మీ రెజ్యూమ్, అప్లికేషన్‌లలో ఏయే స్కిల్స్‌ను హైలైట్ చేయాలో కూడా సూచిస్తుంది.
- కవర్ లెటర్ అసిస్టెన్స్ : మీ దరఖాస్తు చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా ఉండాలి. అందులో ప్రధానంగా కవర్ లెటర్ అద్భుతంగా ఉండాలి. కానీ దీనిని రూపొందించడానికి చాలా సమయం పడుతుంది. అందుకే కవర్ లెటర్ అసిస్టెన్స్ టూల్‌ను లింక్డిన్ తీసుకువచ్చింది. ఈ ఇంటరాక్టివ్ చాట్‌బాట్‌తో మీరు చాట్ చేస్తూ, మీ నైపుణ్యాలు, అనుభవం, ఎలాంటి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారు అనే విషయాలను తెలియజేయాలి. వాటికి అనుగుణంగా ఓ డ్రాఫ్ట్ కవర్ లెటర్‌ను ఈ ఏఐ టూల్ క్రియేట్ చేసి ఇస్తుంది.
- ఏఐ సాయంతో నిపుణుల సలహా :వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఇచ్చిన సలహాలను ముందుగానే లింక్డిన్ ఏఐ టూల్‌లో నిక్షిప్తం చేశారు. వీటిని ఎప్పటికప్పుడు కొత్త వాటితో అప్‌డేట్ చేస్తుంటారు. కనుక యూజర్లు తమ సందేహాలను అడిగి, ఈ ఏఐ టూల్ ద్వారా తగిన సమాధానాలు తెలుసుకోవచ్చు.