Hotel Management :ఎక్కువ మందికి ఉపాధిని చూపిస్తూ, ఏటా వృద్ధి నమోదు చేస్తున్న రంగాల్లో ఆతిథ్యం చాలా ముఖ్యమైంది. ఈ విభాగంలో జాతీయ స్థాయి సంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్(IHM) ప్రధానమైంది. ఇది బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఇందులో ప్రవేశాలకు ఎన్సీహెచ్ఎం జేఈఈ-2025 ప్రకటన విడుదల చేసింది. ఇందులో చేరడానికి ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసుకున్నవారు మేటి సంస్థల్లో సులువుగా ఉపాధిని పొందవచ్చు.
మేనేజ్మెంట్లో ఐఐఎంలు, ఇంజనీరింగ్లో ఐఐటీలు, మెడిసిన్లో ఎయిమ్స్ మాదిరి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు ఐహెచ్ఎంలు చిరునామా. ఇవి జాతీయ స్థాయిలో 21 సంస్థలను నెలకొల్పాయి. ఇవే కాకుండా రాష్ట్ర స్థాయి, పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు ఇలా 79 సంస్థల్లో ప్రవేశానికి ఎన్ఐఏ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఎన్సీహెచ్ఎం-జేఈఈ) నిర్వహిస్తోంది. అన్ని సంస్థల్లోనూ కలిపి 12,000కు పైగా సీట్లు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హోటల్ మేనేజ్మెంట్లు :(కేంద్రం ఆధ్వర్యంలో)
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్(ఐహెచ్ఎం) - హైదరాబాద్ - 285 సీట్లు
- డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్(వైఎస్ఆర్ నిథమ్) - హైదరాబాద్ - 120 సీట్లు
- స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ - తిరుపతి - 60 సీట్లు
- తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ - సంగారెడ్డి(మెదక్) - 60
- శ్రీశక్తి, హైదరాబాద్ ప్రైవేట్ ఐహెచ్ఎం - 120 సీట్లు
పరీక్ష ఎలా : (ఆన్లైన్)
మొత్తం : 200 మార్కులు
సరైనన సమాధానానికి 4 మార్కులు, తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు
భాష : ఇంగ్లీష్, హిందీ
సమయం : 3 గంటలు
సిలబస్ :
- న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అననలిటికల్ ఆప్టిట్యూడ్ - 30 ప్రశ్నలు
- రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ - 30 ప్రశ్నలు
- జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ -30 ప్రశ్నలు
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 60 ప్రశ్నలు
- సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు
1. న్యూమరికల్ అబిలిటీ, అనలిటికల్ ఆప్టిట్యూడ్ విభాగం :8,9,10 తరగతుల గణిత పుస్తకాలు బాగా చదవాలి. ఇందులో వయసు, చైన్ రూల్, పని-వేతనం, సమయం-పని విభాగాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కూడికలుు, గుణింతాలు, భాగహారం, తీసివేతలు, గసాభా, కసాగు, నిష్పత్తి, సగటు, భిన్నాలు మొదలైన వాటిలో ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. ప్రతి అంశంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధనలు చేస్తే మంచిది.
2. రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ విభాగం : ఈ విభాగంలో ఎక్కువ ప్రశ్నలను బాగా ఆలోచించి సమాధానం గుర్తించవచ్చు. సిరీస్, బ్లడ్ రిలేషన్లు, వెర్బల్ రీజనింగ్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ విభాగాలపై దృష్టి పెట్టాలి.
3. కరెంట్ అఫైర్స్, జీకే విభాగం :జనరల్ నాలెడ్జ్(స్టాక్ జీకే) నుంచే ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. పాలిటీ, హిస్టరీ, జనరల్ సైన్స్ల్లోని ప్రాథమిక అంశాల నుంచి వీటిని అడుగుతున్నారు. వీటిలో కూడా 8,9,10 తరగతుల సైన్స్, సోషల్ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకోవాలి. కరెన్సీ, రాజధానులు, క్రీడలు-విజేతలు, పార్లమెంట్లు, పుస్తకాలు-రచయితలు వీటిని ప్రాధాన్యంతో చదివితే మంచిది.
4. ఆంగ్ల విభాగం :ఈ విభాగంలో ప్రశ్నలు మరీ కష్టమేమీ కాదు. వ్యతిరేక పదాలు, సమానార్థాలు, ప్రిపొజిషన్లు, కంజంక్షన్లు, పాసేజ్ మొదలైన విభాగాల నుంచే అడుగుతున్నారు. హైస్కూల్ పాఠ్యాంశాల్లోని వ్యాకరణాంశాలు బాగా అధ్యయనం చేస్తే మంచి స్కోరు రావచ్చు.
5. సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్ విభాగం : ఈ విభాగంలోని ప్రశ్నలకు ఆలోచించి, విచక్షణతో సమాధానం గుర్తించాలి. ఆతిథ్య, పరిశ్రమ, సేవారంగంపై అవగాహన పెంచుకుంటే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.