Changes in B.Tech and B.Pharmacy Seats in Convener Quota For 2025-26 Academic Year :తెలంగాణరాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం కన్వీనర్ కోటాలోని 15% బీటెక్, బీఫార్మసీ సీట్లకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు పోటీపడే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి లోకల్, నాన్ లోకల్‌ను నిర్ధారించేందుకు విధివిధానాల రూపకల్పనపై ప్రభుత్వం నియమించిన కమిటీ త్వరలో సిఫారసులను చేయనుంది.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి ఛైర్మన్‌గా, మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఇటీవల ఈ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు కావడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ప్రవేశాలకు స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించడంతోపాటు 15% కోటాపైనా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఈ కోటా కింద ఇప్పటివరకు తెలంగాణ, ఏపీతోపాటు తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ, వ్యాపారరీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి పిల్లలు ఎప్‌సెట్ రాసి సీట్లు దక్కించుకుంటున్నారు. ఒకవేళ ఈ కోటా తొలగిస్తే ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలంగాణ కుటుంబాల పిల్లలకు సీట్లు ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకే ఈసారి అన్ని రాష్ట్రాల వారు ఆ సీట్లకు పోటీపడి దక్కించుకునేలా సిఫారసు చేస్తామని, త్వరలో ప్రభుత్వానికి ముసాయిదా నివేదిక అందజేస్తామని కమిటీ ఛైర్మన్ బాలకిష్టారెడ్డి చెప్పారు. ఈ కోటా కింద రాష్ట్రంలో సుమారు 12 వేల బీటెక్ సీట్లుంటాయి. వాటిల్లో ప్రస్తుతం ఏపీ విద్యార్థులు 4 వేల నుంచి 5 వేల సీట్ల వరకు దక్కించుకుంటున్నారని అంచనా.