Campus Recruitments in Telangana : ఉస్మానియా, జేఎన్‌టీయూ యూనివర్సిటీలలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్తగా ఉద్యోగావకాశాలకు మార్గాలు మరింత మెరుగయ్యాయి. బహుళజాతి ఐటీ, నిర్మాణ రంగ సంస్థలు, ఆటోమొబైల్ కంపెనీలు ట్రైనీ ఇంజినీర్ల కోసం రాష్ట్రంలోని ప్రముఖ పేరుగాంచిన ఉస్మానియా, జేఎన్‌టీయూ వర్సిటీలకు వస్తున్నాయి. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ, నిర్మాణ రంగాల సంస్థల ప్రతినిధులు ముందుకొస్తున్నారు. దేశవిదేశాల్లో పరిస్థితులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొన్నేళ్లుగా ప్రాంగణ నియామకాలు అంతగాలేవని, ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయని వారు ఈ సందర్బంగా వివరించారు.
ప్రధాన విభాగాల విద్యార్థులకే ప్రాధాన్యం
- ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్‌ఈ)తో పాటు ఇంజినీరింగ్‌లో ప్రధాన విభాగాలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల విద్యార్థులకు బహుళజాతి సంస్థలు మొదటి ప్రాధాన్యమిస్తున్నాయి.
- ఓయూ, జేఎన్‌టీయూలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ వారిలో 85శాతం మందికి ట్రైనీ ఇంజినీర్లు, ఇంటర్న్‌షిప్‌లు లభించాయి ఎలక్ట్రానిక్స్ విభాగంలో 50శాతం మందికి, సివిల్ ఇంజినీరింగ్‌లో 38 శాతం, మెకానికల్‌లో 32 శాతం, ఎలక్ట్రికల్‌లో 35శాతం మందికి ఉద్యోగాలు లభించాయి.
- జేఎన్‌టీయూలో రెండు, మూడు నెలల్లో మరికొన్ని సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన విద్యార్థుల్లో 70శాతం మందికిపైగా ట్రైనీ ఇంజినీర్లుగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని జేఎన్‌టీయూ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ అధికారి విష్ణువర్థన్ తెలిపారు. గతేడాది 562 మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో పాల్గొంటే వారిలో సుమారుగా 446 మందికి జాబ్స్ వచ్చినట్లు పేర్కొన్నారు.
లక్షల్లో వేతనాలు :ఉస్మానియా, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాల్లో జరిగిన ప్రాంగణ నియామకాల్లో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థుల్లో కొందరికి రూ.లక్షల్లో జీతాలు దక్కనున్నాయి. ఓయూలో ఇద్దరు విద్యార్థులు రూ.26 లక్షలు, జేఎన్‌టీయూలో ఓ విద్యార్థినికి రూ. 52లక్షలు, మరో విద్యార్థినికి రూ. 25.97లక్షల వార్షిక వేతన ప్యాకేజీలను సొంతం చేసుకున్నారు.