Health Insurance Premiums May Rise By Up To 15% Soon :నేటి కాలంలో ఆసుపత్రి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆరోగ్యం బీమా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? అయితే ఇది మీ కోసమే. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు చేసింది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనితో ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియాన్ని మరింత పెంచాలని ఆలోచిస్తున్నాయి.
ఏ వయసు వారికైనా
ఇంతకు ముందు ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లుగా ఉండేది. ఈ నిబంధనను ఐఆర్‌డీఏఐ ఇటీవలే తొలగించింది. దీనితోపాటు ముందస్తు వ్యాధుల విషయంలో వెయిటింగ్ పీరియడ్‌ను 4 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించింది. దీని వల్ల ఇన్సూరెెన్స్ కంపెనీలకు అధిక క్లెయింలు వచ్చే అవకాశం ఉంది. అంటే వాటిపై అధిక ఆర్థిక భారం పడనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య బీమా ప్రీమియాలను మరింత పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
15 శాతం వరకు పెంపు!
ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలను పెంచనున్నట్లు ఇప్పటికే పలు బీమా సంస్థలు సమాచారం ఇస్తున్నాయి. పాలసీలను బట్టి, కొత్త ప్రీమియం రేట్లు ఈ 2024 జులై లేదా ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు 10% నుంచి 15% వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే పలు సాధారణ, స్టాండలోన్ ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీదారులకు ప్రీమియం పెంపు సమాచారాన్ని పంపిస్తున్నాయి.