How to Apply Unsecured Business Loan :ఏదైనా వ్యాపారాన్ని నడపడానికి మూలధనం అవసరం. వ్యాపార విస్తరణ, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ వంటివాటి కోసం నగదు కావాలి. అలాంటప్పుడు చాలా మంది బిజినెస్ లోన్ తీసుకుంటారు. అయితే కొందరు వ్యాపారులకు బిజినెస్ లోన్ తీసుకోవడానికి ఎటువంటి ఆస్తులు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అన్సెక్యూర్డ్ లోన్స్ ఉపయోగపడతాయి. ఈ క్రమంలో అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అంటే ఏమిటి? ఈ రుణంపై వడ్డీ రేటు ఎలా ఉంటుంది? లాభనష్టాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అంటే ఏమిటి?
ఎటువంటి హామీ లేదా తాకట్టు పెట్టుకోకుండా రుణగ్రహీతకు ఇచ్చే రుణాలను అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అంటారు. రుణ ఆమోదం సాధారణంగా రుణగ్రహీత క్రెడిట్ యోగ్యత, ఆదాయ స్థిరత్వం, వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్లు వ్యాపారి ప్రత్యక్ష ఆస్తులపై కాకుండా, అతడి ఆదాయ స్థాయి, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఇస్తారు.
అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్లోని రకాలు
టర్మ్ లోన్
టర్మ్ లోన్ అనేది నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించాల్సిన రుణం. నెలవారీ కూడా ఈ లోన్ చెల్లింపులను చేయవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ లేదా వ్యాపార విస్తరణ కోసం ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ టర్మ్ లోన్ రీపేమెంట్ వ్యవధి 12 నెలల నుంచి 5 ఏళ్ల వరకు ఉంటుంది.
ఓవర్ డ్రాఫ్ట్
బ్యాంకులు తమ ఖాతాదారులకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తుంటాయి. దీనిని ఉపయోగించుకుని తమ ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా, పరిమితి మేరకు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. సకాలంలో వడ్డీ చెల్లిస్తూ ఉంటే, ఓవర్‌డ్రాఫ్ట్ నగదును మీ వ్యాపారం కోసం ఉపయోగించుకోవచ్చు.
లోన్స్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్
కొన్ని ప్రభుత్వ పథకాలు వ్యాపారాలకు, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అన్ సెక్యూర్డ్ లోన్స్‌ను అందిస్తాయి. ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY), స్టాండప్ ఇండియా వంటి పథకాల ద్వారా వ్యాపారులు లోన్లు పొందొచ్చు.
సూక్ష్మ రుణాలు
రుణగ్రహీతల తక్షణ నగదు అవసరాలను తీర్చడానికి మైక్రో ఫైనాన్స్ సంస్థలు సూక్ష్మ రుణాలను అందిస్తాయి. రూ. 5వేలు నుంచి రూ. 2 లక్షల వరకు ఈ రుణాలను అందిస్తాయి.
వినియోగదారుల రుణాలు
సంస్థ లేదా కంపెనీకి అవసరమైన కంప్యూటర్లు, ఏసీ, ఫర్మీచర్ వంటివాటిని కొనుగోలు చేయడం కోసం కన్జూమర్ లోన్స్‌ను రుణ సంస్థలు ఇస్తుంటాయి. ఈ రుణాలతో సంస్థకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ విధానంలో తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ వల్ల ఉపయోగాలు
- అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్ వేగంగా ఆమోదం పొందుతుంది. రుణదాతల క్రెడిట్ స్కోర్, బిజినెస్ ఫైనాన్షియల్స్, రీపేమెంట్ సామర్థ్యాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వేగంగా రుణం మంజూరు చేస్తారు.
- ఈ లోన్స్ తరచుగా సౌకర్యవంతమైన రీపేమెంట్ నిబంధనలతో లభిస్తాయి. రీపేమెంట్ వ్యవధి ఐదేళ్ల వరకు ఉంటుంది.
- ఈ లోన్ వల్ల వ్యక్తిగత, వ్యాపార ఆస్తులకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎటువంటి ఆస్తులు లేని వారికి అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
- అన్ సెక్యూర్డ్ బిజినెస్ లోన్‌ను తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించడం వల్ల రుణగ్రహీత క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుంది.
నష్టాలు
- అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్లపై సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే అధిక వడ్డీ రేటు ఉంటుంది. రుణదాతలు పూచీకత్తు లేకుండా ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కొంటారు. అందుకే ఎక్కువ వడ్డీ రేటును విధిస్తారు.
- అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ విషయంలో రుణదాతలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎటువంటి తాకట్టు లేకుండా లోన్లు ఇవ్వడమే అందుకు కారణం. అందుకే అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ విషయంలో కఠినమైన అర్హత ప్రమాణాలను విధిస్తారు. ఈ రుణాలు సాధారణంగా బలమైన క్రెడిట్ హిస్టరీ, గణనీయమైన వార్షిక రాబడి ఉన్నవారికి లభిస్తాయి.
- చాలా రుణసంస్థలు యజమాని నుంచి వ్యక్తిగత హామీని అడుగుతాయి. ఒకవేళ రుణం తీర్చడంలో అయిన సందర్భంలో వ్యక్తిగత ఆస్తులు ప్రమాదంలో పడతాయి.
లోన్ అప్లై కోసం ఉండాల్సిన డాక్యుమెంట్లు
- పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉండాలి.
- వ్యాపారం తాలుక ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఉండాలి.
- గత ఆరు నెలలకు సంబంధించిన బ్యాంకు స్టేట్ మెంట్లు
- పాన్ కార్డు, ఫారం 60
- వ్యాపార రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, లైసెన్స్ లేదా ఇతర చట్టపరమైన పత్రాలు